మాభూమి టు ఫిదా జర్నీ... సాయిచంద్ ! - MicTv.in - Telugu News
mictv telugu

మాభూమి టు ఫిదా జర్నీ… సాయిచంద్ !

July 27, 2017

‘ బండెనక బండిగట్టి పదాహారు బండ్లు గట్టి ఏ బండ్లె పోతవు కొడుకా నైజాం సర్కరోడా.. ’ అలాగే ‘ పల్లెటూరి పిలగాడ పసులగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో.. ’ అనే ఈ రెండు పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్సే ! ఈ పాటను హమ్ చేస్కుంటే గుర్తుకొచ్చే సినిమా ‘ మా భూమి ’
గౌతంఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వివిధ ఫిలిం పెస్టివల్స్ లో అనేక అవార్డులు, రివార్డులు పొందింది. 1980 మార్చ్ 23 న రిలీజైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమై తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మంచి సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలబడింది. ‘ ఎదురు తిరిగితే ఏముంది తరతరాల దౌర్జన్యం మట్టి కరుస్తుంది ’ అనే రణ నినాదంతో వచ్చి సాయుధ కార్మికుల పోరాటానికి బాసటగా నిలబడిందీ చిత్రం. కార్వే, కైరో, బెర్లిన్, సిడ్నీ వంటి అంతర్ఝాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన మాభూమి తెలుగు సినిమా చరిత్ర లిఖించుకోవడానికి ఒక గొప్ప సందర్భాన్ని కానుకగా ఇచ్చింది. అంతే కాదు CNN – IBN వారి వంద గొప్ప భారతీయ చిత్రాల్లో ఈ సినిమా చోటు సంపాదించుకుందంటే అంచనా వెయ్యొచ్చు ఇదెంత గొప్ప సినిమానో…

ఈ సినిమాకు సంభాషణలు రాయడమే కాదు ఒక నిర్మాతగా కూడా వ్యవహరించారు బి. నర్సింగ్ రావు. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం ఈ సినిమాకు కళా దర్శకత్వం వహించారు. అలాగే అప్పట్లో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో జానపద సంగీత విభాగంలో పని చేసిన వింజమూరి సీతాదేవి సంగీతం అందించారు. కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సుకు కొంగర జగ్గయ్య వాయిస్ ఓవర్ అందించడం విశేషం ! శ్రీశ్రీ రాసిన ‘ మరో ప్రపంచం పిలిచింది ’ పాట కూడా మాభూమిలో భాగమైంది.

మా భూమికి మూలం

1940 – 1948 మధ్య కాలంలో తెలంగాణ రైతు పోరాట గాథతో రూపుదిద్దుకుంది ఈ సినిమా. నిజాం కాలంలో ప్రజల కష్టాలు, ఆనాటి పరిస్థితులు, భూస్వామ్య వ్వవస్థలో సామాన్యుడు ఎన్ని బాధలు పడ్డాడు, పేద ప్రజల తిరుగుబాటు వంటి.., సమస్యలను చర్చిస్తుంది మాభూమి సినిమా. కిషన్ చందర్ రాసిన ఉర్దూ నవల ‘ జబ్ ఖేత్ జాగే ’ ( పొలాలు మేల్కుంటే ) ఆధారంగా తెరకెక్కింది. రచయిత ప్రాణ్ రావ్, పార్థూ బెనర్జీల సహకారంతో ఆ నవలలోని పాయింటును బేస్ చేస్కొని దానికి తెలంగాణ రైతు పోరాటం, కార్మికుల తిరుగుబాటు, ఆనాటి సమస్యలను జోడించి చక్కటి స్ర్కీన్ ప్లేతో మా భూమి స్ర్కిప్టును తయారు చేస్కున్నారు. దర్శకుడు గౌతంఘోష్, రచనా బృందం కలిసి ఈ సినిమా కోసం చాలా శ్రమించారు. ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని అవగతం చేస్కోవడానికి చాలా వూర్లను సందర్శించి తెలంగాణ ప్రాంతీయత్వాన్ని ఓనప్ చేస్కున్నారు. అటుపై ఈ సినిమాకు దర్శకత్వం వహించారు గౌతంఘోష్. మెదక్ జిల్లా మంగళపర్తి గ్రామంలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. 50 రోజల పాటు దొంతి, దౌల్తాబాదులలో కూడా సినిమా షూటింగ్ ను చేసారు.

మాభూమి సాయిచంద్

ఈ సినిమాలో నటులను సినిమావాళ్ళను తీస్కోకుండా రంగస్థలం నుండి వచ్చిన వారినే సెలెక్టు చేస్కున్నారు. కథానాయకుడిగా రామయ్య పాత్రలో త్రిపురనేని సాయిచంద్ ను తీస్కున్నారు. ఇప్పుడు ‘ ఫిదా ’ సినిమాలో తనే హీరోయిన్ కు ఫాదర్ గా నటించాడు. ప్రముఖ కథకుడు, నవలాకారుడు అయిన త్రిపురనేని గోపీచంద్ గారి కుమారుడే సాయిచంద్. ఈ సినిమా సాయిచంద్ కు మంచి గుర్తింపును తీస్కొచ్చింది. రామయ్య తండ్రి వీరయ్యగా కాకరాల నటించారు. అలాగే ఇతర తారాగణంగా ఎంబీవి ప్రసాద్ రావు, లక్ష్మణరావు, హంస, తెలంగాణ శకుంతల, రామిరెడ్డి, భూపాల్ రెడ్డి, గద్దర్, నర్సింగ్ రావు, జయప్రకాశ్, మాస్టర్ సురేష్ వంటివారు కూడా మాభూమిలో నటించారు. సాయిచంద్ ఈ సినిమా తర్వాత ‘ అంకురం ’ సినిమాలో చేసి దూరదర్శన్ ఛానల్లో ప్రోగ్రాములు, డాక్యుమెంటరీలు చేస్కుంటూ సినిమాలకు దూరంగా వున్నారు.

వాళ్ళ నాన్నగారు రాసిన అనేక కథలను, నవలలను టెలీఫిల్ములుగా తెరకెక్కించారు. మాభూమి సినిమాలో రామయ్య పాత్రలో మెప్పించి, ప్రేక్షకుల గుండెల్లో వుండిపోయారు సాయిచంద్. ఇప్పుడు ఫిదాలో తండ్రిగా గుర్తుండిపోయే పాత్రలో నటించి మెప్పించారు. అందరు నటుల్లా వందలు, వేలల్లో నటించకుండా ప్రాధాన్యమున్న పాత్ర ఒక్కటైనా చాలు ఆ నటుడికది చిరస్థాయి కీర్తినిస్తుందని నమ్మారేమో అందుకే రాశి కన్నా వాసికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన మాభూమి గుర్తుండిపోయింది. ఇప్పుడు ఫిదా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి తన పాత్రకు మంచి గుర్తింపును తీస్కొచ్చింది. తెలంగాణ తండ్రి అంటే ఇలాగే వుంటాడనిపించింది సాయిచంద్ ను చూస్తే. మాభూమి నుండి ఫిదా వరకు తన జర్నీలో చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలబడే పాత్రలు చేశారనడంలో సందేహం లేదు !