న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ ముగిసినా.. కరోనా కారణంగా చాలా కాలం తరువాత జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ మొత్తం సాయి పల్లవి చేసిన ‘వెన్నెల’ అనే పాత్ర చుట్టూ తిరుగుతుందని. ఇది సాయి పల్లవి కెరీర్లోనే బెస్ట్ మూవీ అని చిత్ర యూనిట్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే రిలీజ్ రోజున విరాటపర్వానికి మంచి మౌత్ టాక్ వచ్చినా, అది ఈ సినిమాను కమర్షియల్‌గా గట్టెక్కించలేక పోయింది. సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం తేలిపోయింది. ఫలితంగా ఈ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విరాటపర్వం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జూలై 1న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎల్ఎస్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ఈశ్వరీ, నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు.