హుజూర్‌నగర్ గడ్డపై గులాబీ జెండా - MicTv.in - Telugu News
mictv telugu

హుజూర్‌నగర్ గడ్డపై గులాబీ జెండా

October 24, 2019

Saidi Reddy .

కాంగ్రెస్ పార్టీ కంచుకోటపై గులాబీ జెండా ఎగిరింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత కనబరిచారు. హోరా హోరిగా సాగిన ఉపపోరులో టీఆర్ఎస్ అభ్యర్థికి ఘన విజయం వరించింది. సొంత నియోజకవర్గాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. మూడుసార్లు హుజూర్‌నగర్‌లో గెలిచినా ఆయన భార్య పద్మావతిని గెలిపించుకోలేక సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకున్నారు.   

కౌంటింగ్ ముగిసే సమయానికి 43,624 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీని కైవసం చేసుకున్నారు. శానంపూడి సైదిరెడ్డికి 94,102 ఓట్లు రాగా, పద్మావతికి 58,199 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి 1,906, టీడీపీ అభ్యర్థి 1,513 ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. మరోవైపు కౌంటింగ్ పూర్తి కాకుండానే కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. 10వ రౌండ్‌లోనే ఆమె బయటకు వెళ్లారు.

దీంతో హుజూర్‌నగర్ చరిత్రను టీఆర్ఎస్‌ తిరగరాసింది. తొలిసారి అక్కడ తమ జెండాను ఎగరవేసింది. 14 టేబుళ్లపై 22 రౌండ్లలో 7 మండల్లాలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో కౌంటింగ్ చేపట్టారు.  ఈసారి గత ఎన్నికల కంటే ఎక్కువగా 85.96 శాతం పోలింగ్ నమోదు అయింది.

ఐక్యంగా పోరాడినా ఫలితం శూన్యం : 

ఈసారి ఎన్నికలను ఉత్తమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సొంత నియోజవర్గం కావడంతో ఓదశలో ఈ ఎన్నిక సవాల్‌గా తీసుకున్నారు. విజమైనా పరాజయమైనా తానే భరిస్తానని వెల్లడించారు. పార్టీ నేతలకు కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఉమ్మడి నల్గొండ  జిల్లాల్లో పట్టు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్, సీనియర్ నేత జానారెడ్డి లాంటి నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. రేవంత్ రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు ప్రచారంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. మొదటి నుంచి ఎక్కడా పట్టుసడలకుండా వ్యూహం రచించారు. అయినప్పటికీ గులాబీ పార్టీ వ్యూహం ముందు వీరి ఎత్తులు చిత్తయ్యాయి. అధికార పార్టీ ఉప ఎన్నికలో విజయం సాధించింది. 

కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం : 

ఆర్టీసీ సమ్మె ప్రభావం అధికార పార్టీ అభ్యర్థిపై పడుతుందని అంతా భావించారు. అయితే అదేమి ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ప్రజలంతా అధికారపార్టీకే పట్టం కట్టారు. సమ్మెను హుజూర్‌నగర్ ఉప ఎన్నికతో ముడిపెట్టలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే సైదిరెడ్డి విజయం సాధించారు. ఆయన విజయంతో గులాబీ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. 

ప్రభావం చూపని బీజేపీ,టీడీపీ : 

తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి డిపాజిట్‌ దక్కలేదు. అటు, తెలంగాణలో ఉనికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా టీడీపీ హుజూర్‌నగర్‌లో నిలిచినా భంగపాాటు తప్పలేదు. ప్రధానంగా కాంగ్రెస్,టీఆర్ఎస్ మధ్యే ఈ పోటీ జరిగింది. 

రౌండ్ల వారిగా సైదిరెడ్డి మెజార్టీ : 

 

1వ రౌండ్ – 2,467

2వ రౌండ్ – 4,000

3వ రౌండ్ – 6,750

4వ రౌండ్ – 9,356

5వ రౌండ్ -11,000

6వ రౌండ్ – 12,767

7వ రౌండ్ – 14,300

8వ రౌండ్ – 17,687

9వ రౌండ్ -19,356

10వ రౌండ్ – 22,000

11వ రౌండ్ – 21,618

12వ రౌండ్ – 23,828

13వ రౌండ్ – 25,366

14వ రౌండ్ – 26,999

15వ రౌండ్ – 29,967

16వ రౌండ్ – 32,256

17వ రౌండ్ – 34,506

18వ రౌండ్ – 36,112

19వ రౌండ్ – 38,344

20వ రౌండ్ – 40,547

21వ రౌండ్ – 42,484

22వ రౌండ్ – 43,284

కాగ హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికల  చరిత్రలో ఇంత భారీ మెజార్టీతో గెలవడం ఇదే ప్రథమం కావడం విశేషం.