Saif al Adel as Al Qaeda's next chief
mictv telugu

తదుపరి అల్‌ఖైదా చీఫ్‌గా అమెరికా బద్ద వ్యతిరేకి.. లాడెన్‌కు ఆప్తుడు

August 2, 2022

నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అంతం చేసి ఆ సంస్థకు నాయకుడు లేకుండా చేసింది అమెరికా. ఈ నేపథ్యంలో జవహరి హతమైన కొన్ని గంటలకే తదుపరి చీఫ్‌గా కొత్త వ్యక్తి పేరు వినిపిస్తోంది. అల్ ఖైదా వ్యవస్థాపక సభ్యుడు, సంస్థలో మూడో స్థానంలో ఉన్న సైఫ్ అల్ అడెల్ నాయకత్వ బాధ్యతలు చేపడతాడని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఓ వార్తను ప్రచురించింది. అతని చరిత్ర చూస్తే భయంకర అమెరికా వ్యతిరేకి అని తెలుస్తోంది. ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం అతని వివరాలు ఇలా ఉన్నాయి. జవహరి లాగా అడెల్ కూడా ఈజిప్టుకు చెందిన వాడు. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పనిచేశాడు.

జవహరి స్థాపించిన ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్‌లో పని చేశాడు. 1980 ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన రష్యన్ వ్యతిరేక దళాలతో కలిసి పోరాడాడు. పలుమార్లు అమెరికన్ పౌరులు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాడు. 1998లో టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ళు జరిపాడు. అప్పటినుంచి అమెరికా అతడిని వెతుకుతూనే ఉంది. అడెల్‌ను పట్టించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. అంతకు ముందు సోమాలియాలోని మొగదిషు వద్ద జరిపిన బాంబు దాడిలో 18 మంది అమెరికన్లు చనిపోయారు. 2001 నుంచి మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న అడెల్.. లాడెన్‌కు ఆప్తుడిగా ఉండేవారు. అతనికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వ్యవహరించేవారు. చాలా కాలం ఇరాన్‌లో ఉన్న అడెల్.. ఇప్పుడు ఎక్కడున్నాడో అమెరికాకు తెలియదు. కాగా, కేడర్ ప్రకారం చూస్తే అడెల్ తదుపరి చీఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి.