Saipallavi will play sita role in Bollywood ramayan oppisite ranbirkapoor
mictv telugu

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రౌడీ బేబీ?!

December 6, 2022

సాయిపల్లవి బాలీవుడ్ లో అడుగు పెట్టనుందా? అంటే అవుననే అంటుందీ బాలీవుడ్ ఇండస్ట్రీ. అది కూడా సీత పాత్రలో రణబీర్ జంటగా కనిపించనుందట!
ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరిసిందీ మలయాళీ భామ. కానీ తెలుగు హైబ్రీడ్ పిల్లగా అందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నోతెలుగు సినిమాల్లో కనిపించి మంచి మార్కులు సంపాదించుకుంది. చివరగా గార్గి సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నది సాయిపల్లవి. ఈ అమ్మడి గురించి ఈ మధ్య అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలకు గుడ్ బై చెప్పేసి చెల్లెలితో కలిపి క్లినిక్ ఓపెన్ చేస్తుందని టాక్ వచ్చింది. దీనిపై సాయిపల్లవి కానీ, వాళ్ల కుటుంబం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు.. తెలుగు అబ్బాయిని పెండ్లి చేసుకొని తెలుగింటి కోడలు అవ్వబోతుందనే పుకారు కూడా చాలా రోజుల నుంచి వినబడుతున్నది. ప్రస్తుతం ఈ నాచురల్ బ్యూటీ బాలీవుడ్లో అడుగుపెడుతుందనే వార్త వినిపిస్తున్నది.

ఎప్పుడూ ఒకే జంటను తెరపై చూడాలంటే బోర్. సరికొత్త జంటలు తెరపై కనిపిస్తే ఆ లుక్, ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. తెరపై తాజా జంటలు చూడడానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2023 సంవత్సరం బాలీవుడ్ అభిమానులకు కచ్చితంగా ఆసక్తికరంగా ఉండబోతున్నది. సౌత్ దివా సాయి పల్లవి , రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ జంటల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తారని అంటున్నారు.

మధు మంతెన నిర్మించబోయే ‘రామాయణం’లో వీరిద్దరూ కనిపించనున్నారట. సెప్టెంబర్ 2023లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. సీత పాత్రను పోషించడానికి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ముందుగా రాముడి పాత్రకు హ్రుతిక్ రోషన్ అనుకున్నారు. సీత పాత్ర కోసం దీపికా పదుకొణె, కరీనా కపూర్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు రాముడి పాత్రలో రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా హ్రుతిక్ రోషన్ ఖరారైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించేవరకు ఈ పుకార్లలో నిజమేంతో!!!