Saipriya lover Srisailam arrested by the police
mictv telugu

సాయిప్రియ కేసులో ట్విస్ట్.. పాల వ్యాపారం అంటే ఒప్పుకోరన్నందుకు..

September 10, 2022

Saipriya lover Srisailam arrested by the police

వనపర్తి జిల్లాలో దారుణ హత్యకు గురైన హైద్రాబాద్ అమ్మాయి సాయిప్రియ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. స్నాప్ చాట్ ద్వారా నిందితుడు అమ్మాయిని ట్రాప్ చేసినట్టు గుర్తించారు. పెళ్లి గురించి మాట్లాడుకుందామంటూ నిందితుడు వనపర్తికి రప్పించుకున్నాడు. వివరాల్లోకెళితే.. రాజేంద్రనగర్ సర్కిల్ మధుబన్ కాలనీకి చెందిన మేకల వెంకటేశ్ కుమార్తె సాయిప్రియ (19) వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం మానాజీ పేటకు చెందిన అంజన్న కుమారుడు శ్రీశైలంతో పరిచయం ఉంది. ఇద్దరూ శంషాబాద్‌లో పాఠశాల స్థాయి నుంచి చదువుకున్నారు.

తర్వాత కాలేజీ కూడా ఒకటే కావడంతో వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది. అయితే శ్రీశైలం ఇంటర్ తప్పడంతో ఊళ్లోనే ఉంటూ డైరీ వ్యాపారం పెట్టుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడగా, సాయి ప్రియ విషయం చెప్పి మాట్లాడడానికి తల్లిదండ్రులను సాయిప్రియ ఇంటికి పంపాడు. అయితే అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అటు సాయిప్రియ కూడా తన పేరెంట్స్‌తో శ్రీశైలాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పగా, వారు వారించి అంతకంటే మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తామని చెప్పడంతో ఊరుకుంది. కానీ, శ్రీశైలం మాత్రం కోపంతో రగిలిపోయి సాయిప్రియను నమ్మించి వనపర్తికి రప్పించాడు. గ్రామస్థులకు తన మేనమామ కూతురని పరిచయం చేశాడు. అనంతరం మాట్లాడదామంటూ కెనాల్ సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకోమని బలవంతం చేయగా, పాల వ్యాపారం చేసే నీతో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరని, ఈ విషయం స్వయంగా కలిసి చెప్పి పోదామని వచ్చినట్టు తేల్చి చెప్పడంతో ఆగ్రహించిన శ్రీశైలం ఆమెను చున్నీతో ఉరివేసి చంపేశాడు. అనతరం స్నేహితుడితో కలిసి కెనాల్ సమీపంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ఆమె ఫోన్ సమీపంలోని బావిలో పడేశాడు. అయితే కూతురు కనిపించడం లేదని మేకల వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీశైలంపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. అక్కడ స్థానిక పోలీస్ స్టేషనులో విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. దాంతో పోలీసులు శ్రీశైలంతో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు.