Sajal Sheikh pushed the young man from the train in west bengal
mictv telugu

షాకింగ్ వీడియో.. వేధింపులపై నిలదీసినందుకు రైల్లోంచి తోసేశాడు

October 18, 2022

రైల్లో ప్రయాణిస్తున్న మహిళలతో అసభ్య ప్రవర్తనపై నిలదీసినందుకు ఓ యువకుడిని రైల్లోంచి తోసేశారు. పశ్చిమ బెంగాల్‌లో శనివారం రాత్రి ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హావ్డా – మాల్దా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో సజల్ షేక్ అనే వ్యక్తి తన ఇంటికి వెళ్తున్నాడు. నలుగురితో కలిసి ఓ గ్యాంగుగా ఏర్పడిన సజల్ బ్యాచ్.. రైళ్లో మర్యాదగా కూర్చోకుండా ప్రయాణీకులతో దుర్భాషలాడడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం చేశారు.

 

దీంతో ఓ యువకుడికి కోపం వచ్చి నిలదీయగా, గ్యాంగు నుంచి ముందుకు వచ్చిన ఓ వ్యక్తి.. నిలదీసిన యువకుడిని రైల్లోంచి తోసేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు తిరిగి తన సీట్లో కూర్చున్నాడు. కిందకు తోసేయడంతో స్పృహ కోల్పోయిన బాధితుడిని తెల్లారి రైల్వే పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, కోలుకొని జరిగిందంతా పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించాడు. ‘కొంతమంది గట్టిగా మాట్లాడుతూ అసౌకర్యానికి గురి చేశారు. నా పక్కనే కూర్చున్న ఓ కుటుంబం వారి ధోరణితో అసహనానికి గురైంది. ఈ విషయం చెప్పడానికి వారి వద్దకు వెళ్లడమే నేను చేసిన తప్పు. గ్యాంగులోంచి ఓ వ్యక్తి నాతో గొడవపడడానికి ముందుకు వచ్చాడు. చంపేస్తానంటూ బెదిరించాడు. తర్వాత ఏమైందో తెలియదు. చూస్తే పట్టాలపై పడి ఉన్నాను. పోలీసులు కాపాడడం వల్ల బతికాను’ అంటూ పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.