నారాయణకు ఇచ్చిన బెయిల్‌పై పైకోర్టులో సవాల్ చేస్తాం : సజ్జల - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణకు ఇచ్చిన బెయిల్‌పై పైకోర్టులో సవాల్ చేస్తాం : సజ్జల

May 11, 2022

పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుడైన మాజీ మంత్రి నారాయణకు కోర్టు బెయిలివ్వడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బెయిల్‌పై పైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో మీడియాతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సజ్జల ఈ అంశంపై మాట్లాడారు. ‘నారయణతో పాటు మరిన్ని విద్యాసంస్థలు ఈ వ్యవహారంలో ఉన్నాయి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రాల ఫోటోలు తీసి బయటకు పంపారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకే అక్రమాలకు పాల్పడ్డారు.

నారాయణ ఆదేశాల మేరకే లీకులకు పాల్పడ్డట్టు డీన్ పోలీసులకు చెప్పారు. విద్యావ్యవస్థలో విష సంస్కృతిని పెట్టి ఎన్నో ఏళ్లుగా మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతున్నాయి. వారందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నారాయణ ప్రమేయం ఉండబట్టే పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ కక్ష ఏమీలేదు. అలాంటిది ఉంటే చంద్రబాబునే అరెస్ట్ చేసేవాళ్లం కదా. అమిత్ షా, గవర్నర్లకు లెటర్ రాస్తే ఏమీ జరగదు. లీకేజీలో ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసుతో సంబంధం ఉంటే చంద్రబాబునైనా సరే ఆధారాలతో అరెస్ట్ చేస్తాం. నారాయణ చైర్మన్ కాకున్నా.. లీకుల వ్యవహారంలో ఆయన పాత్ర ఉంటే నిందితుడు అవుతాడు కదా’ అంటూ వ్యాఖ్యానించారు.