కేజీఎఫ్, కాంతార వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు దక్షిణాదిలో భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దక్షిణాదిలో అన్ని భాషల్లో సినిమాలు నిర్మించడంతో పాటు హిందీలోనూ రెండు చిత్రాలు చేయనున్నట్టు నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సలార్ విడుదల తేదీ, కేజీఎప్ 3 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘రాబోయే ఐదేళ్లలో 3 వేల కోట్లను సినిమా పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించాం. ఈ పరిశ్రమ మున్ముందు ఇంకా డెవలప్ అవుతుంది.
మన కల్చర్, సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న కథలను ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించాం. మన తర్వాతి తరాలకు వాటిని తెలియజేయడమే దాని ఉద్దేశం. ప్రస్తుతం సలార్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నాం. ఇదయ్యాక నీల్ కేజీఎఫ్ 3 కథపై కూర్చుంటారు. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ అనుకున్నాడు. కాంతార సీక్వెల్ లేదా ప్రీక్వెల్ పై రిషభ్ రాగానే చర్చిస్తాం (ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు). వచ్చే ఏడాది మా బ్యానర్ లో 12 నుంచి 14 సినిమాలు విడుదల అవనున్నాయి’ అని వ్యాఖ్యానించారు.