జీతాలకు కరోనా కోత మరో మూడు నెలలు! - MicTv.in - Telugu News
mictv telugu

జీతాలకు కరోనా కోత మరో మూడు నెలలు!

March 31, 2020

Salary cuts in telangana government employees 

కరోనా లాక్‌డౌన్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించడం తెలిసిందే. నెలకు రూ. 1700 కోట్లు మిగిల్చే ఈ కోత మార్చి నుంచే మొదలు కానుంది. అయితే లాక్‌డౌన్ ప్రభావం మూడు నెలలకు పైగా ఉంటుంది కనుక కోత కూడా మూడు నెలలు పాటు అమలు చేస్తారని భావిస్తున్నారు. దీనిపై గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వం స్పందించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కత్తిరింపు అమల్లో ఉంటుందని వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, రిటైర్డ్ ఉద్యోగులు కలుపుకుని 4.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 

కోతలు ఇలా..  

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల్లో 75 శాతం కోత పడుతుంది.  అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాలు 60 శాతం తగ్గుతాయి. ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం , నాలుగో తరగతి, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జతాల్లో 10 శాతం కోత పడుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లనూ 50 శాతం కోస్తారు.  నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం పడుతుంది. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందుకుంటున్న సంస్థల ఉద్యోగులకూ కోత వర్తిస్తుంది.