ఈ కాలంలో సగటు మనిషి జీతం అంటే ఖర్చులకు సరిపోయేంత మాత్రమే. ఇంటి అద్దె, కిరాణం, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు, భార్యా పిల్లల ఆరోగ్య పరిస్థితులు.. తదితర అవసరాలన్నీ తీరిపోనూ నెలకు ఓ వెయ్యో, రెండు వేలో మిగిలితే గగనమే. మంచి చదువులు చదివి, కార్పోరేట్ కంపెనీల్లో కొలువులు చేసే వారి సంగతి వేరే అనుకోండి. వారికెలాగూ సంపాదన లక్షల్లో ఉంటుంది కాబట్టి పెద్దగా దిగులు చెందక్కర్లేదు. కానీ మామూలు జీతాలకు పని చేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, క్లర్క్‌లు, ప్రైవేట్ టీచర్లు, డ్రైవర్లు, షాపింగ్ మాల్స్‌లో పని చేసే క్యాషియర్లు, ఇతరులకు మాత్రం చెప్పుకోదగ్గ జీతాలేవీ ప్రస్తుత కాలంలో లేవు. వీరంతా ఏదో రకంగా బతుకును నెట్టుకురావల్సిందే తప్ప మరో గత్యంతరం లేదు.
అయితే వీరికి భిన్నంగా ఓ డ్రైవర్ మాత్రం.. సెలబ్రిటీలకు, సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఏడాదికి లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అలా అని ఓవర్ టైమో, లేదంటే మిగతావాళ్ల కంటే ఇంకేదో గొప్పగా ఏం చేయట్లేదు. మామూలు డ్రైవర్ జాబే కానీ శాలరీ మాత్రం దాదాపు రూ.25 లక్షలు. ఇది ప్రస్తుత శాలరీ కాదండోయ్. ఐదేళ్ల కిందటి మాట. 2017లోనే రూ.24 లక్షలుంటే ఇప్పడు తక్కువలో తక్కువగా రూ.30లక్షలపైనే ఉంటుందని అంచనా. ఇంతకీ ఆ డ్రైవర్ ఎవరంటే అపరకుబేరుడు ముకేశ్ అంబానీ పర్సనల్ కార్ డ్రైవర్. నెలకు రూ.2 లక్షల జీతంతో అంబానీ ఆ డ్రైవర్‌ను ఓ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకున్నారని సమాచారం.
సదరు కాంట్రాక్టు సంస్థ.. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలావాడాలి..? ఎలాంటి రోడ్లపైన అయినా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా కారును ఎలా నడిపాలి అనే విధంగా ట్రైనింగ్ ఇస్తుందట. డ్రైవర్లతో పాటు వంటమనుషులు, గార్డ్స్, ఇతర సిబ్బందికి ప్రోత్సాహకాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని ఆ కథనాలు వెల్లడించాయి.
ఈ డ్రైవర్ ఒక్కడికే కాదు.. చాలామంది సెలబ్రిటీలు.. తమ అసిస్టెంట్లు, బాడీ గార్డులు, ఆయాలకు కూడా ఏడాదికి కోట్లల్లో, నెలకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారట. ఇటీవల షారుక్ ఖాన్ మేనేజర్ ఒక విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ఆమె సంవత్సరానికి రూ. 7 కోట్ల నుంచి 9 కోట్ల జీతం అందుకుంటారని తెలుస్తోంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. పెద్ద చదువులు చదివి, మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే బదులు.. అదే శాలరీ, అదే లగ్జరీ లైఫ్‌ని ఈ రకంగా సంపాదిచ్చొచ్చు అని అంటున్నారు నెటిజన్లు.