Salman Rushdie: What is the controversy about his book 'The Satanic Verses'
mictv telugu

సల్మాన్ రష్దీపై దాడికి ఆ నవలే కారణం? అందులో ఏముంది?

August 13, 2022

 


అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత సల్మాన్ రష్దీ మెడపై కత్తితో దాడి చేయడంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాడి వెనుక సల్మాన్ రష్దీ రాసిన ‘ ద సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకమే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఆ నవలలో ఏముందో తెలుసుకుందాం. 1947లో ముంబయిలోని ఓ కాశ్మీరీ కుటుంబంలో జన్మించారు సల్మాన్ రష్దీ. ఆ తరువాత బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నారు. ఆ తరువాత 2016లో యూఎస్ పౌరసత్వాన్ని పొందారు.. ప్రస్తుతం అమెరికాలోనే జీవిస్తున్నారు. రష్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రఖ్యాత బుకర్ ప్రైజ్ దక్కింది. ఈయన 1980లో రాసిన ‘ ది సాతానిక్ వర్సెస్’ నవల వివాదాస్పదం అయింది. ఈ బుక్ పై పలు ముస్లిం సంఘాల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు రష్దీ. రష్టీని హతమారస్తామని బెదిరింపులు వచ్చాయి.
రష్ధీని చంపినవారికి రూ.23 కోట్లు

ముఖ్యంగా ఇరాన్ ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసింది. కొందరు ముస్లిం దేశాలు ఈ బుక్ లో ముస్లిం వ్యతిరేక అంశాలు ఉన్నాయని.. దైవదూషణ ఉందని ఆరోపించాయి. మెజారిటీ ముస్లిం దేశాల్లో ఈ బుక్ ను బ్యాన్ చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా రహెల్లా ఖొమేనీ.. 1989లో సల్మాన్ రష్దీపై ఫత్వాను జారీ చేశాడు. ముస్లింలకు వ్యతిరేకంగా దైవదూషణకు పాల్పడిన వ్యక్తిని చంపాలని పిలుపునిచ్చాడు. రష్దీని చంపితే 3 మిలియన్ డాలర్లు (రూ. 23.89 కోట్లు) ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా రష్దీని చంపితే 6 లక్షల డాలర్లు (రూ.4.77 కోట్లు) ఇస్తామని 2016లో ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినట్లు అక్కడి మీడియా సంస్థల్లో కథనాలు సైతం వచ్చాయి.

అసలు ఆ నవలలో ఏముంది?

బ్రిటన్‌కు వలస వెళ్లిన ఇద్దరు భారతీయ ముస్లింలు గిబ్రీల్ ఫరిస్తా, సలాదిన్ చమ్చా అనే ప్రధాన పాత్రలతో ఈ నవల రచించారు రష్ధీ. ఫరిస్తా, సలాదిన్ బ్రిటన్‌కు వెళ్తున్న విమానం హైజాక్ అయి ఇంగ్లిష్ చానల్లో పేలిపోతుంది. వారిద్దరు మాత్రమే బతుకుతారు. తర్వాత మంత్ర తంత్రాల్లాంటి పరిణామాలతో కథ నడుస్తుంది. సలాదిన్.. ఫరిస్తాపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఫరిస్తా అతణ్ని క్షమిస్తాడు. ఇద్దరూ భారత్ కు వస్తారు. ఫరిస్తా ఆత్మహత్య చేసుకోగా, సలాదిన్ తన తండ్రిలో కలసి భారత్ లోనే ఉండిపోతాడు. కలలు, పలవరింతలు, మంత్ర వాస్తవికత(మేజిక్ రియలిజం) ధోరణిలో సాగే ఈ నవల్లో ఇస్లాంపై విమర్శలు, దైవదూషణలు ఉన్నాయని ముస్లిం ఆరోపణ.

అనువాదకులపైన దాడులు
ఈ నవలను పలు భాషల్లోనికి అనువాదం చేసిన వారిపైనా ముస్లిం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ నవల జపనీస్ అనువాదకుడు హితోషి ఇగరాషి 1991లో దారుణ హత్యకు గురయ్యాడు. ఇటాలియన్ అనువాదకుడు, నార్వేజియన్ ప్రచురణకర్త దాడి నుండి తృటిలో తప్పించుకున్నారు. టర్కీలోకి అనువదించిన రచయితపైనా దాడి చేశారు. ఈ పుస్తకం గురించి తనపై వస్తున్న ఆరోపణలపై రష్దీ అనేక ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ‘ది సాటానిక్ వెర్సెస్’ను విచారణ లేకుండా నిషేధించారని ఆరోపించారు. దీనిపై నిర్మించిన చిత్రం భారతదేశంలో 2013న విడుదలైంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సల్మాన్ రష్దీనే.

దాడికి అదే కారణమా?

ప్రస్తుతం రష్దీ మరణానికి పిలుపునిచ్చిన ఇరాన్ ప్రభుత్వం పట్ల నిందితుడు హదీ మాటర్‌కు సానుభూతి ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. నిందితుడి ఫేస్‌బుక్ ఖాతాలో 1989లో సల్మాన్ రష్దీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖొమేనీ, అతని వారసుడు అయతుల్లా ఖమేనీ ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే.. న్యూయార్క్ పోలీసులు మాత్రం రష్దీపై నిందితుడు దాడికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.