దిల్లున్న గరీబోడు.. కుమార్తె చదువు కోసం దాచిన సొమ్ముతో పేదల ఆకలి తీర్చాడు - MicTv.in - Telugu News
mictv telugu

దిల్లున్న గరీబోడు.. కుమార్తె చదువు కోసం దాచిన సొమ్ముతో పేదల ఆకలి తీర్చాడు

May 10, 2020

Salon owner in Madurai feeds 615 families with Rs 5 lakh he saved for daughter

కొందరు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారంటే.. వారి పెద్దమనసుకు దండం పెట్టాలనిపిస్తుంది. ఆడపిల్లలకు చదువు ఎందుకు అనుకునే కొందరికి ఈ మధ్య తరగతి తండ్రి సవాల్ విసిరాడు. కుమార్తె చదువు కోసం రూ.5 లక్షలు పొదుపు చేశాడు. ఓ సెలూన్ నడుపుతూ కాస్త కాస్త పొదుపు చేస్తూ తన కుమార్తె భవిష్యత్తును బంగారంలా తీర్చిదిద్దాలని పాటు పడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన కరోనా సంక్షోభాన్ని కళ్లారా చూస్తున్నాడు. తనవంతుగా ఈ సమాజానికి ఏమైనా చెయ్యాలని భావించాడు. ఇందుకోసం ఆయన తన కుమార్తె భవిష్యత్తు కోసం దాచిన ఆ సొమ్మును పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాడు. తమిళనాడులోని మధురైలో జరిగింది ఈ ఘటన. మేలమడైకి చెందిన 47 ఏళ్ల మోహన్ (47) సెలూన్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా మహమ్మారి రాకతో లాక్‌డౌన్ కారణంగా పేదలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారిని చూసి ఆయన మనసు కరిగిపోయింది. 

తనవంతుగా వారికి ఏమైనా చేయాలని భావించి.. తన కుమార్తె చదువు కోసం దాచిన రూ.5 లక్షలను వారికోసం సాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా 5 కిలోల బియ్యం, కూరగాయలు, కిరాణ, వంట నూనెతో కూడిన కిట్‌ను తయారుచేసి 615 కుటుంబాలకు అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. పేదల కష్టాలు తనను కలచివేశాయని.. తన కుమార్తె చదువు కోసం డబ్బులు ఆదా చేసేందుకు ఇంకా చాలా సమయం ఉందని మోహన్ తెలిపాడు. ఇంకా 400 కుటుంబాలకు సాయం చేయాల్సి ఉందని, తన భార్య ఆభరణాలను కానీ, తన ప్లాట్‌ను కానీ తాకట్టు పెట్టి వారికి సాయం చేస్తానని అన్నాడు. తనకింకా చాలా భవిష్యత్తు ఉందని, తర్వాత సంపాదించుకోగలుగుతానని చెప్పాడు.