ఈ సెలూన్‌లో బోర్ కొట్టదు.. పైగా సబ్సిడీ కూడా  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ సెలూన్‌లో బోర్ కొట్టదు.. పైగా సబ్సిడీ కూడా 

December 8, 2019

Saloon library.

హెయిర్ కటింగ్, షేవింగ్, డై కోసం సెలూన్లకు వెళ్లి గంటల తరబడి వేచి చూస్తుంటారు జనం. ఆదివారమైతే చెప్పాల్సిన పనే లేదు. వారికి విసుగు పుట్టకుండా వార్తాపత్రికలు, టీవీలను సెలూన్ యజమానులు ఏర్పాటు చేస్తుంటారు. మరి వాటితోనూ విసుగు పుడితే? ఉందిగా, సెల్ ఫోన్! దాంట్లో ముఖం పెట్టేసి గడిపేస్తుంటారు. మరి దాంతోనూ బోర్ కొడితే? ఈ ఆలోచనే వచ్చింది పొన్  మారియప్పన్‌కు. వెంటనే తనింట్లో, మిత్రుల ఇంట్లో ఉన్న పుస్తకాలను సేకరించి సెలూన్లో పెట్టశాడు. కస్టమర్లకు కూడా ఇది బాగా నచ్చేసింది. క్షరకులు బిజీగా ఉన్నప్పుడు కస్టమర్లు తమకిష్టమైన పుస్తకాలను చదివేస్తున్నారు. 

తమిళనాడులోని తూత్తుకుడి మిల్లార్‌పురంలో ఉందీ సెలూన్ లైబ్రరీ. అక్కడ 200కుపైగా పుస్తకాలు ఉన్నాయి. యజమానికి మారియప్పన్‌కు పెద్దగా చదువుకోలేదు. అయితే చదువు విలువ అతనికి తెలుసు. కస్టమర్లు ఫోన్లతో, టీవీతో కాలక్షేపం చేస్తున్నారని, అందుకు బదులుగా వారిలో పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించాలని అనుకున్నాడు. అంతేకాదండోయ్.. తన సెలూన్‌లో రాజకీయాల మాట్లాడొద్దని, చక్కగా చదువుకుని కొత్త విషయాలు తెలుసుకోవాలని కూడా ప్రేమగా చెబుతుంటాడు. కస్టమర్ల ఏఏ పుస్తకాలు చదువుతున్నారో గమనించి మిగతా వారికి సిఫార్సు కూడా చేస్తుంటాడు.  పుస్తకపఠనాన్ని ప్రోత్సహించడానికి అతడు కొంత ఆదాయం కూడా వదులుకుంటున్నారు. కటింగ్‌కు వచ్చేవాళ్లు పుస్తకాలు చదివితే తక్కువ డబ్బు తీసుకుంటారు. రూ. 80కి బదులు రూ. 50 ఇస్తే చాలంటాడు!