'సాలు దొర సెలవు దొర'.. మళ్లీ ప్రత్యక్షం
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలనే దిశగా తెలంగాన బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై పోరాడటంతో పాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇతర పార్టీల నేతలను భారీగా చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే పలు వ్యూహాలను రచిస్తోంది. తాజాగా హైదరాబాద్లోని తమ పార్టీ ఆఫీస్ వద్ద సాలు దొర.. సెలవు దొర డిజిటల్ బోర్డు తాజాగా మళ్లీ ఏర్పాటు చేసింది. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సూచిస్తూ.. బీజేపీ గతంలో ఈ కౌంట్డౌన్ బోర్డు ఏర్పాటు చేసింది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. అనుమతి లేకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారనే కారణంతో తొలగించాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.జీహెచ్‌ఎంసీ ఆదేశాలతో కొద్దిరోజులు బోర్డు ప్రదర్శనను నిలిపివేసిన బీజేపీ.. ఆ తర్వాత అనుమతి తీసుకుని మళ్లీ వినియోగంలోకి తెచ్చింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకున్న క్రమంలో నవంబర్ 19న పున:ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఆ బోర్డును ఉంచనున్నారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు డిజిటల్ బోర్డును ఉంచుతామని, క్లాక్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 24 గంటలు ఈ క్లాక్ పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ బోర్డులో కేసీఆర్‌ను అధికారంలో నుంచి దించడానికి ఇంకా 474 రోజులు టైమ్ ఉందంటూ కనిపిస్తోంది. తాజాగా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. మళ్లీ పార్టీ కార్యాలయం అవరణలో 'సాలు దొర సెలవు దొర' డిజిటల్ బోర్డును ప్రారంభించింది.