Sam Bankman Fried, founder and CEO of FTX company, who lost 94% of his wealth in one day
mictv telugu

ఒక్కరాత్రిలో లక్ష కోట్లు కోల్పోయిన సీఈవో.. చరిత్రకెక్కిన ఘటన

November 10, 2022

Sam Bankman Fried, founder and CEO of FTX company, who lost 94% of his wealth in one day

వ్యక్తుల జీవితాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కోటీశ్వరులు బిచ్చగాళ్లు కావచ్చు, పేదవారు కోటీశ్వరులు కావచ్చు. పేదవారికి అదృష్టం కారణమైతే.. ధనవంతులకు స్వయంకృతాపరాధం అని చెప్పవచ్చు. ఇదే తరహాలో ఓ కుర్ర సీఈవోకి షాక్ తగిలింది. రాత్రికి రాత్రి లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఫలితంగా ఒక్క రోజులో భారీ మొత్తంలో సంపద కోల్పోయిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. క్రిప్టో కరెన్సీ గురించి మనకు తెలిసిందే. చాలా మంది దీంట్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ కరెన్సీ ఎవ్వరి నియంత్రణలో ఉండదు. దానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.

అందుకే ఇందులో ఎక్కువగా షాకింగ్ ఫలితాలే ఉంటాయి. ధనవంతుడిగా మారాలన్నా, పేదవాడు అయిపోవాలన్నా క్రిప్టో కరెన్సీనే కారణమవుతోంది. వివరాల్లోకెళితే.. క్రిప్టో ఎక్సేంజీ కంపెనీ అయిన ఎఫ్‌టీఎక్స్ కంపెనీ ఫౌండర్, సీఈవో అయిన సామ్ బ్యాంక్ మాన్ ఫ్రైడ్ తన కంపెనీని తన ప్రత్యర్ధి సంస్థ అయిన బినాక్స్‌‌‌ కొనుగోలు చేయనుందని మంగళవారం ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన సంపద కరగడం ప్రారంభించింది. ఎంతలా అంటే 15.2 బిలియన్ డాలర్లలో 14.6 బిలియన్ డాలర్లు నష్టపోయేంత. దీని దెబ్బకు సామ్ బిలీయనీర్ హోదా కోల్పోయాడు. ప్రస్తుతం అతని ఆస్తుల విలువ ఒక బిలియన్ డాలర్ కంటే తక్కువగా 991.50 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ సంస్థ వెల్లడించింది. అటు బినాక్స్ కంపెనీ అధిపతి చాంగ్ పెంగ్ జావో ఈ అంశంపై స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫాం అయిన బినాక్స్.. ఎఫ్‌టీఎక్స్‌‌ని కొనేందుకు ఆసక్తి చూపిందని, ఇందుకు సంబంధించిన డీల్ కూడా కుదిరిందని ట్వీట్ చేశారు.