Samajwadi Party names Dimple Yadav as its candidate for Mainpuri bypoll
mictv telugu

మామ స్థానంలో పోటీ చేస్తున్న కోడలు.. ట్వీటర్ ప్రకటన

November 10, 2022

యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్‌ యాదవ్‌(44) పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్‌ వాదీ పార్టీ తన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. అక్టోబర్‌ 10న ములాయం మరణించడంతో ప్రస్తుతం ఆ లోక్‌సభ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది.

 

ఇందులో భాగంగా మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి డిసెంబర్‌ 5న ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్‌ 17న నామపత్రాల దాఖలుకు చివరి రోజు. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

అఖిలేష్‌తో వివాహం తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన డింపుల్.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్‌ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్‌ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్‌ పాథక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.