Samantha Ruth Prabhu opens up about suffering from myositis
mictv telugu

సమంతకు సోకిన వ్యాధికి ట్రీట్మెంట్ కూడా లేదు

October 30, 2022

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. చాలామంది ఈ వ్యాధి గురించి తెలసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అసలు ఆ వ్యాధి ఎందుకు వస్తుందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు డాక్టర్లు చెప్తున్న సమాచారం ప్రకారం మయోసైటిస్ అంటే చర్మ వ్యాధి అని తెలుస్తోంది. ఈ వ్యాధి సోకిన వారికి కండరాల నొప్పులు విపరీతంగా ఉంటాయని.. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరని అంటున్నారు. చిన్న పనులు చేస్తేనే వెంటనే నీరసించి పోవడం, క్షణాల్లో అలసిపోవడం, ఉన్నట్టుండి కింద పడిపోవడం లాంటి లక్షణాలు ఈ వ్యాధి కలిగి ఉంటుందని పలువురు డాక్టర్లు చెప్తున్నారు.

అంతేకాకుండా.. ఎక్కువసేపు నిలబడినా, నడిచినా అలసిపోతారని.. ఆహారాన్ని మింగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారని.. కనురెప్పలు, మోచేతులు, మోకాలు, పిడికిలిపై ఎరుపు లేదా ఊదారంగులో దద్దుర్లు వస్తాయని డాక్టర్లు వెల్లడించారు. అయితే మయోసైటిస్ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళల్లో సోకుతుందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో ప్రతి ఏడాది ఈ వ్యాధి కేసులు కొత్తగా 1,600 నుంచి 3,200 వరకు నమోదవుతుంటాయట. ప్రస్తుతం ఆ దేశంలో 50 వేల నుంచి 75 వేల వరకు మయోసైటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని డాక్టర్లు అంటున్నారు. మయోసైటిస్ వ్యాధిలో డెర్మటో మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, జువెనైల్ మయోసైటిస్, పాలీ మయోసైటిస్, టాక్సిక్ మయోసైటిస్ అనే ఐదు రకాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఈ వ్యాధి నయం కావడానికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఏదీ లేదని.. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా సమంత వ్యాధి గురించి తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. సమంత ధైర్యంగా ఉండాలని.. ఆమె త్వరగా కోలుకుని నార్మల్ కావాలని జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.