ఇంగ్లిష్ సినిమాలో నటిస్తున్న సమంత
టాలీవుడ్‌లో గ్రాఫ్ పడిపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసిన సమంత రూత్ ప్రభు అట్నుంచి అటు హాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతోంది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో హల్‌చల్ చేస్తున్న సామ్ ఓ ఆంగ్ల చిత్రానికి సంతకం చేసింది. హీరో వయసులో ఆమె కంటే పదేళ్లు చిన్నవాడు కావడం విశేషం. ‘చెన్నై స్టోరీ’ అనే ఇంగ్లిష్ చిత్రంలో ఆమె నటిస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
భారత సంతతిక చెందిన బ్రిటిష్ కుర్ర హీరో వివేక్ కల్రా 36 ఏళ్ల సమంతతో జట్టుకడుతున్నాడు. అతని వయసు పాతికేళ్లు. ఇంగ్లండ్ యువకుడికి, చెన్నై చిన్నదానికి మధ్య లవ్ స్టోరీ పెట్టి దీన్ని తెరకెక్కిస్తున్నారు. వివేక్ కల్రా ‘వాయేజర్స్’, ‘లిఫ్ట్’, ‘త్రీ మంత్స్’, ‘బ్లైండెడ్ బై ద లైట్’’ చిత్రాల్లో నటించాడు.
సమంతతో ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన తెలుగు నిర్మాత సునీత తాటి ‘చెన్నై స్టోరీ’కి సహనిర్మాత. గురు ఫిల్మ్స్, రిపుల్ వరల్డ్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళంలోకి కూడా డబ్ చేయనున్నారు. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘ఖుషీ’ చిత్రంలో నటిస్తోంది. ‘శాకుంతలం’ చిత్రం ప్లాప్ కావడంతో టాలీవుడ్‌లో ఆమెకు ఖుషీ తప్ప మరో చిత్రం లేనట్లే.