ఓ వైపు మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూనే మరోవైపు సౌత్ , నార్త్ సినిమాల్లో బిజీ బిజీ నటిస్తూ తనదైన క్రేజ్‌ను కంటిన్యూ చేస్తోంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ బ్యూటీ నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టే పనిలో నిమగ్నమైంది సమంత. ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేముందు అమ్మవారి ఆశిస్సులను తీసుకునేందుకు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుంది . సామ్‌తో పాటు చిత్ర యూనిట్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది. మలయాళ హీరో దేవ్, డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత నీలిమలు సామ్‌తో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న పిక్స్‌ను హీరో దేవ్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
శకుంతల , దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా శాకుంతలంను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు డైరెక్టర్ గుణశేఖర్. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, మధుబాల వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు కూడా బాలనటిగా తొలిసారిగా తెరముందు కనిపించబోతోంది. శాకుంతలం సినిమా వచ్చే నెల 14 న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్లు, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇకపై డైరెక్ట్‌గా స్టార్స్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని సినిమాకు హైప్ తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు.