కేన్స్లో శాకుంతలానికి 4 అవార్డులు
గుణశేఖర్ డైరెక్షన్ లో రూపొందిన పౌరాణిక ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో శకుంతలగా సమంత, ఆమెకు జంటగా దేవ్ మోహన్ నటించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అయితే అవార్డుల విషయంలో మాత్రం ఈ మూవీ దూసుకుపోతోంది. తాజాగా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో శాకుంతలం చిత్రం నాలుగు విభాగాల్లో అవార్డులం సొంతం చేసుకుంది.
కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 4 అవార్డులను సొంతం చేసుకున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. శాకుంతలం మూవీ బెస్ట్ ఫారెన్ ఫిల్మ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డులు దక్కించుకుంది. ఈ మేరకు గుణ టీమ్ వర్క్స్ సంస్థ ట్విట్టర్‌తో పోస్ట్ చేసింది. శాకుంతలం 4 అవార్డులు సొంతం చేసుకోవడంపై సమంత స్పందించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిత్రానికి నాలుగు అవార్డులు దక్కడంపై ఆనందం వ్యక్తం చేసింది. చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది.
శాకుంతలానికి అవార్డులు రావడంపై సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడిన సమంత కూడా అవార్డుకు అర్హురాలు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అర్హ వెండితెరకు పరిచయమైంది. భారీ అంచనాల మధ్య గత నెలలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.