స్వలింగ సంపర్కుల పెళ్లికి ఒప్పుకోం.. కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

స్వలింగ సంపర్కుల పెళ్లికి ఒప్పుకోం.. కేంద్రం

September 14, 2020

Same sex marriages not recognised by our laws, society and our values: Centre to HC

పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కుల చర్యలకు సుప్రీంకోర్టు ఆమోదించినా.. ఆ జంటల మధ్య వివాహాలను ఒప్పుకోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.  స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన విలువలు, చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం గుర్తించలేదని, ఇలాంటి వివాహాలను అనుమతించలేమని కేంద్రం స్పష్టంచేసింది. హెచ్ఎంఏ(హిందూ వివాహ చట్టం), ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌ల ఎదుట సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వ వాదనను వినిపించారు. 

ఇలాంటి వివాహాలను మన చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించవని పేర్కొన్నారు. ఈ తరహా వివాహాలకు అనుమతిస్తూ పిటిషనర్‌ కోరిన ఊరటను మెహతా తప్పుబట్టారు. ఈ తరహా వివాహాలను చట్టబద్ధం చేయాలని.. ఊరట కల్పించాలని పిటిషనర్‌ కోరగా.. ఇందుకు అనుమతిస్తే ఇది పలు చట్ట నిబంధనలకు విరుద్ధం అవుతుందని పేర్కొన్నారు. ‘హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు.. భార్య, భర్తల గురించి ప్రస్తావిస్తాయి. అలాంటి ఈ పాత్రలను మనం స్వలింగ జంటల్లో ఎలా చూస్తాం?’ అని ప్రశ్నించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారిపోతున్నాయని.. అవి భారత్‌కు వర్తించవచ్చు, వర్తింపకపోవచ్చని కోర్టు  వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసులో పిటిషన్‌ అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రభావితం అయ్యేవారు బాగా చదువుకున్నవారని, వారే నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టంచేసింది. కాగా, స్వలింగ వివాహాన్ని రిజిస్టర్‌ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది అభిజిత్‌ అయ్యర్‌ మిత్రాను కోర్టు కోరింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 21కి వాయిదా పడింది.