సమ్మక్క-సారక్క జాతర మొదలైంది.. - MicTv.in - Telugu News
mictv telugu

సమ్మక్క-సారక్క జాతర మొదలైంది..

January 31, 2018

గిరిజనుల పెద్ద పండగ ‘సమ్మక్క-సారక్క’ జాతర బుధవారం అంగరంగ వైభవంగా మొదలైంది. లక్షలాది గిరిజనులు గద్దెదేవతలను దర్శించుకోవడానికి పోటెత్తారు. 6 కి.మీ. పరిధిలో ఇసకేస్తే రాలనంతగా హాజరయ్యారు. జంపన్నవాగు జనంతో నిండిపోయింది.

గ్రహణంతో సంబంధం లేదు.. కానీ..

ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం నేపథ్యంలో జాతర ఎప్పుడు మొదలవుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహణం తర్వాత.. 10 గంటల ప్రాంతంలో  దేవతలను గద్దెలపైకి తీసుకొస్తామని పూజారులు చెప్పారు. నిజానికి ఈ జాతరకు గ్రహణాలతో సంబంధం లేకుపోయినా కోటిన్నరమంది భక్తుల మనోభావాల ప్రకారం గ్రహణం తర్వాతే గద్దెలపైకి దేవతలు వస్తారన్నారు. పూజరి సాలమ్మ .. సారలమ్మ గద్దెకు పూజలు చేశారు.  సమ్మక్క రాకతో మేడారం జాతర మొదలవుంది. తర్వాత కన్నెపల్లి నుంచి సారలమ్మను బుట్టలో తీసుకొస్తారు. మరోపక్క.. మహబూబాబాద్ జిల్లా గంగారం పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును మంగళవారం మేడారానికి తీసుకొచ్చారు.

భారీ ఏర్పాట్లు

రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను ఎలాంటి ఆటంకాలూ లేకుండా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పోలీసులను మోహరించింది. జంపన్న వాగు వద్ద 300 మంది గజఈత గాళ్లను ఉంచారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. అయినా ఇప్పటికే సమస్య తలెత్తింది. గట్టమ్మ గుడి, మల్లంపల్లి మధ్య వేలాదిది వాహనాలు నిలిచిపోయాయి.