వైజాగ్‌లో సంపూర్ణేష్ అరెస్ట్.. గుర్తుచేసుకుంటూ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

వైజాగ్‌లో సంపూర్ణేష్ అరెస్ట్.. గుర్తుచేసుకుంటూ ట్వీట్

March 23, 2018

‘హృదయ కాలేయ’ సోగ్గాడు సంపూర్ణేష్ బాబు తెలంగాణవాడు. కానీ ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నా పాల్గొంటాడు. ఏపీకి ప్రత్యేక హోదా పోరు తీవ్రమైన నేపథ్యంలో అతడు వైజాగ్‌లో పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై స్పందించారు. అదేమీ అవమానం కాదని అన్నాడు. సుహృద్భావాన్ని పెంపొదిస్తూ అందర్నీ ఆకట్టుకునే ట్వీట్ చేశాడు.  

‘‘గత సంవత్సరం సోషల్ మీడియాలో యువత వైజాగ్‌లో మానవహారంగా ఏర్పడి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలి అని పిలుపు ఇవ్వటం.. జరిగింది. అది ఉధృతమవటం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆనాడు నన్ను నీకు బాధ్యత లేదా? నీ విజయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరణ లేదా అని ప్రశ్నించి నా బాధ్యత గుర్తు చేశారు. మీరు తలపెట్టబోయే ఆ ఉద్యమానికి నేను వస్తాను అని మాట ఇచ్చాను.

ఈ రోజు సినిమా వాళ్లకి బాధ్యత లేదా అని ప్రశ్నించిన గౌరవ రాజేంద్రప్రసాద్ గారికి నేను విన్నవించేంది ఏంటంటే.. ఆనాడు ఉద్యమానికి సంఘీభావంగా శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, సందీప్ కిషన్ గారు, నిఖిల్ గారు ఇలా ఎందరో యువ హీరోలు మద్దతుగా ట్వీట్లు వేశారు. 

అంతర్జాతీయ సమ్మిట్ కారణంగా ఆ రోజు కాకుండా వేరొక రోజు మీ ఉద్యమాన్ని వాయిదా వేసుకోండి అని నాకు ఆలస్యంగా తెలిపారు. కానీ ఆ ఉద్యమానికి నాయకులంటూ లేరు. యువతే నాయకత్వం వహించింది. మాట ఇచ్చి సమ్మిట్ కారణంగా నేను రావడం లేదు అని చెప్పటం అన్యాయం అవుతుంది. వస్తే అరెస్ట్ చేస్తారని తెలిసినా వెళ్లటం జరిగింది. 

అంతర్జాతీయ ప్రతినిధులు వైజాగ్‌లో ఉన్నప్పుడు వారి శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ వారి బాధ్యత. అందులో భాగంగానే నన్ను అరెస్ట్ చేసి సెల్‌లో పెట్టడం జరిగిందని భావిస్తున్నాను. అందులో ఎటువంటి తప్పు లేదని మనసావాచా నమ్ముతున్నాను.

 ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విషయంలో, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ విషయంలో మనకి జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. పార్టీలకి అతీతంగా ఎవరు పిలిచినా మీతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క ఫో‌న్ కాల్‌తో అందుబాటులో ఉంటాను. సదా మీ ప్రేమకి బానిస- మీ సంపూర్ణేష్ బాబు’’ అంటూ సంపూర్ణేశ్  వివరించాడు. తాను అరెస్టయి ఠాణాలో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు..