పెరుగు తయారు చేసే ఫ్రిజ్.. ప్రపంచంలోనే తొలిసారి..  - MicTv.in - Telugu News
mictv telugu

పెరుగు తయారు చేసే ఫ్రిజ్.. ప్రపంచంలోనే తొలిసారి.. 

January 22, 2020

Samsung Launches Curd Maestro, World’s First Refrigerator That Prepares Curd

పెరుగు తోడు పెట్టాలంటే చలికాలంలో కష్టంగా ఉంటుంది. ఎక్కువ చల్లదనం వల్ల పెరుగు అంత తొందరగా తోడుకోదు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ పెరుగు తోడు వెయ్యడానికి ఓ సరికొత్త ఫ్రిజ్ వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు శాంసంగ్‌.. కర్డ్‌ మ్యాస్ట్రో పేరిట ప్రపంచంలోనే తొలిసారిగా పెరుగును త‌యారు చేసే నూతన రిఫ్రిజిరేటర్లను భారత్‌లో విడుదల చేసింది. ఫ్రిజ్‌లో పెరుగా? అనే సందేహం వద్దు. ఎందుకంటే ఈ ఫ్రిజ్‌కు రెగ్యులర్ ఫ్రిజ్‌లకు అస్సలు పొంతన ఉండదు. దీంట్లో వినియోగదారులు చాలా సులభంగా, వేగంగా గడ్డ పెరుగును తయారు చేసుకోవచ్చు. దీనికి కాలాలతో సంబంధమే ఉండదు. ఏ కాలమైనా, ఎప్పుడైనా పెరుగును తేలికగా తయారు చేసుకోవచ్చు. శాంసంగ్‌కు చెందిన స్మార్ట్‌ కన్వర్టబుల్‌ 5 ఇన్‌ 1 ట్విన్‌ కూలింగ్‌ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫ్రిజ్‌లో తయారైన పెరుగును ఎక్కువ సమయం పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్రిజ్‌లకు నేషనల్‌ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌డీఆర్‌ఐ) ధ్రువీకరించింది.  

యథాతథంగా పాలను మరిగించి చల్లార్చి వాటిలో మజ్జిగ చుక్కలు వేసి ఆ పాలను ఈ ఫ్రిజ్‌లో ఉండే ప్రత్యేక బాక్స్‌లో ఉంచాలి. 5 నుంచి 6 గంటల్లో పెరుగు తయారవుతుంది. మెత్తని పెరుగు అయితే 5 గంటలు, గట్టి పెరుగు అయితే 6 గంటల సమయం పడుతుంది. ఇక ఎలాంటి వాతావరణ స్థితిలో అయినా  ఈ ఫ్రిజ్‌లో పెరుగు చాలా సులభంగా తయారవుతుంది. కాగా, ఈ ఫ్రిజ్‌లు 244, 265, 314, 336 లీటర్ల కెపాసిటీలలో లభ్యం అవుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.30,990 ఉండగా, గరిష్ట ధర రూ.45,990గా ఉంది. మరోవైపు డైరెక్ట్‌ కూల్‌ సిరీస్‌లోనూ శాంసంగ్‌ పలు కొత్త ఫ్రిజ్‌లను లాంచ్‌ చేసింది. వీటి  ప్రారంభ ధర రూ.17,990గా పేర్కొంది.