రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. రైతును లారీతో తొక్కించి చంపారు - MicTv.in - Telugu News
mictv telugu

రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. రైతును లారీతో తొక్కించి చంపారు

July 30, 2020

Sand Mafia Crush Farmer With Lorry

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమకు అడ్డు అదుపు లేదన్నట్టుగా భరితెగించి ఏకంగా ఓ రైతు ప్రాణాలను బలి తీసుకున్నారు. తన పొలం నుంచి ఇసుక రవాణా చేయవద్దంటూ అడ్డుకోబోయిన నరసింహులు అనే రైతును లారీతో తొక్కించి చంపారు. ఆ తర్వాత ఏమి తెలియనట్టు ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. రాజాపూర్ మండలం తిరుమలాపూర్‌లో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు భగ్గుమంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో మనుషుల ప్రాణాలను కూడా తీసే స్థాయికి ఇసుకాసురులు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తిరుమలాపూర్‌ గ్రామం మీదుగా కొంత కాలంగా ఇసుక రవాణా సాగుతోంది. గుర్రం కాడి నరసింహులు అనే వ్యక్తి పొలం మీదుగా ఈ అక్రమ రవాణా చేపట్టారు. దీంతో తన పంట పాడు అవుతోందని లారీలు వెళ్లవద్దంటూ నిలదీశాడు. చాలా కాలంగా అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో అడ్డుకోబోయిన అతన్ని లారీతో ఢీ కొట్టారు. తీవ్ర గాయాలతో రైతు సంఘటన స్థలంలోనే చనిపోయాడు. ఇసుక మాఫియా చేతిలో దారుణ హత్యకు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

ఇంత దారుణం జరిగినా అధికారులు మాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే కోవిడ్ డ్యూటీలో ఉన్నామని హత్య విషయం తమకు తెలియదంటూ సమాధానం ఇచ్చారు. అధికారులు కూడా వారికి వంతపాడుతున్నారని ఆగ్రహించి లారీ అద్దాలు ధ్వంసం చేశారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసి నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మృతదేహంతో ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.