Sandeep Kishan Michael Movie Review In Telugu
mictv telugu

సందీప్ కిషన్ మైఖేల్… మూవీ రివ్యూ

February 3, 2023

Sandeep kishan Michael movie Tollywood movie review

కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో పీరియాడికల్, యాక్షన్ చిత్రాల హవా నడుస్తోంది. కథ, కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. దాంతో అలాంటి ఓ నేపథ్యమున్న ప్రాజెక్టుతోనే ‘మైఖేల్‌’గా ఎంట్రీ ఇచ్చాడు హీరో సందీప్ కిషన్. గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ ఇలా టాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలుండడం, ట్రైలర్‌కి కూడా మంచి స్పందన రావడంతో యాక్షన్ ఫిల్మ్ లవర్స్‌కి ఈ ఫ్రైడే ఓ ఆప్షన్‌గా మారింది. మరి కొత్త కథ, సరికొత్త కథనంతో ప్రేక్షకులను అలరించిందా? సందీప్ కిషన్‌కి ఓ హిట్ అందిందా?

కథ విషయానికొస్తే..

అనాథ అయిన మైఖేల్ తనని కష్టపడి పెంచి చనిపోయిన తల్లి జ్ఞాపకాలతో బతుకుతూ చిన్నప్పటి నుంచే తెగింపు, ధైర్యంతో ఏదో సాధించేయాలన్న కసితో ఉంటాడు. ఈ క్రమంలోనే చిన్నవయసులోనే ముంబైని ఏలుతున్న గ్యాంగ్ స్టర్ గురునాథ్ (గౌతమ్ మీనన్) గ్యాంగులో చేరతాడు. తండ్రి గురునాథ్ స్థానాన్ని దక్కించుకోవాలని, తాను ఓ డాన్‌గా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్). మైఖేల్ పెద్దవాడయ్యాక ఓ రోజు గురునాథ్ మీద కొందరు ఎటాక్ చేస్తారు. గురునాథ్‌ను వాళ్లనుంచి కాపాడడంతో మరింత దగ్గరవుతాడు మైఖేల్. తనకు దక్కాల్సిన గౌరవం మైఖేల్ కి దక్కడంతో కోపంతో ఊగిపోతుంటాడు అమర్ నాథ్. తనను చంపడానికి ప్లాన్ వేసిన వాళ్ళని ఒక్కొక్కర్ని చంపుకుంటూ వస్తున్న గురునాథ్ ఆ లిస్ట్‌లో ఉన్న మరో వ్యక్తి రతన్, అతని కూతురు తీర(దివ్యాంశ కౌశిక్) ఢిల్లీలో ఉన్నారనీ, వాళ్లను చంపిరమ్మని మైఖేల్‌ను పంపుతాడు. కానీ అక్కడికెళ్లాక తీరతో ప్రేమలో పడి రతన్ ని చంపకుడా వదిలేస్తాడు మైఖేల్. దాంతో కథ మలుపుతిరుగుతుంది. ఆ తర్వాత గురునాథ్ గ్యాంగ్ మైఖేల్‌ని ఎలా టార్గెట్ చేశారు? మైఖేల్ వాళ్ల నుండి ఎలా తప్పించుకున్నాడు? తీర ప్రేమను దక్కించుకున్నాడా లేదా? విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ఏంటి? అనేది మిగతా కథ

కథనం ఎలా ఉందంటే..

ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ సినిమా స్టార్టయినా లవ్ స్టోరీ సాగే కొద్దీ కథ కూడా సా..గుతూ వస్తుంది. పాటలు, యాక్షన్ సీన్లతో నడుస్తున్నా పెద్దగా కనెక్టయేంత స్కోపయితే ఉండదు. ఇక సెకండాఫ్ ప్రారంభమయ్యాక కథ నుంచి బైటికొస్తుండగా విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలు ఎంటరవడంతో మళ్లీ కాస్త ఉత్సాహంగా లేచి కూచుంటాడు ప్రేక్షకుడు. వాళ్లు కనింపించే సీన్లు మాత్రమే అంతో ఇంతో ఆడియెన్సును ఎంగేజ్ చేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్సులో అసలు మైఖేల్ ఎవరు? తన గతమేంటి? గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాలనుకున్నాడు? అనే పాయింట్లని రివీల్ చేసినా అప్పటికే కథతో డిస్ కనెక్టయిపోయిన ఆడియెన్.. కేవలం ఆ పాయింట్లను తెలుసుకుని ఊరుకుంటాడంతే. ఇక తీరా ఎండ్

క్రెడిట్ టైటిల్సులో కూడా కొన్ని సీన్లను జోడించి పార్ట్ టూ కూడా ఉందని హెచ్చరించే ప్రయత్నం చేశారు.

ఎవరెలా చేశారంటే..
సందీప్ కిషన్ గతంలోనూ ఇలాంటి పాత్రలు చేసుండడంతో నటన పరంగా గానీ, పాత్ర పరంగా గానీ పెద్దగా ప్రేక్షకుడు కొత్తగా ఫీలయ్యేదేమీ ఉండదు. ఫిజిక్, లుక్ పరంగా బానే కష్టపడ్డా యాక్టింగులో తను ఇంకాస్త మెరుగుపడాల్సింది ఉందని చాలాచోట్ల అనిపిస్తుంటుంది. హీరోయిన్ దివ్యాంశ కూడా సోసోనే. ఎటొచ్చి టికెట్ డబ్బులకి అంతో ఇంతో న్యాయం చేశారనిపించేది విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్లే. ఉన్నవి కొన్నిసీన్లే అయినా ఆడియెన్సుకి థియేటర్లో విజిల్స్ వేసే పని కలిపించేది వాళ్లే. పీరియాడికల్ కథ కావడం, 80, 90 దశకాల్లో కథనం నడుస్తుండడంతో అప్పటి లుక్ వచ్చేలా ప్రొడక్షన్ వర్క్ బాగానే చేశారు. యాక్షన్ సీన్లలో నేపథ్య సంగీతం బానే ఉన్నా కథకి అవసరం లేని చోట కూడా ఫైట్లు రావడంతో అది కూడా బోర్ కొట్టిస్తుంది. ఎడిటింగ్ కి చాలా చోట్ల స్కోప్ ఉన్నా తీసిన షాట్స్, పెట్టిన బడ్జెట్, వింటేజ్ ప్రొడక్షన్ వర్కుని ఎందుకు వేస్ట్ చేయాలని అన్ని సీన్లని ఉంచేసినట్టున్నారు. నాయగన్ లాంటి కొన్ని ఇండియన్ చిత్రాలతో పాటు ఫారిన్ సినిమాల ప్రభావంతో రాసుకున్న కథకి, సన్నివేశాలకి ప్రేక్షకుడు తెగ కనెక్టయ్యేలా మాత్రం రంజిత్ జయకోడి తెరకెక్కించలేకపోయాడు. సినిమాలో చాలా ఫ్రేములు, సీన్లు ఎంత వద్దనుకున్నా కేజీఎఫ్‌నే గుర్తు చేస్తాయి. క్లైమాక్సుతో సహా మరికొన్ని సన్నివేశాలు విక్రమ్ సినిమాని తలపిస్తాయి.

ఓవరాల్‌గా ఎలా ఉందంటే..

యాక్షన్ సన్నివేశాలు, విజయ్ సేతుపతి కనిపించే మరికొన్ని సీన్లు పరవాలేదనిపించినా మొత్తంగా మాత్రం గ్యాంగ్ స్టర్ చిత్రాలంటే మక్కువ చూపే ప్రేక్షకులు తప్పదనుకుంటే ఓసారి చూసేయొచ్చు. ట్రైలర్ నచ్చి ఏదో కొత్తగా ప్రయత్నించినట్టున్నారు కదా అని థియేటర్ వరకూ వెళ్లి కచ్చితంగా ట్రై చేస్తాం అనుకుంటే ఓ లుక్కేయొచ్చు.

ఇవి కూడా చదవండి : 

రైటర్ పద్మభూషణ్… మూవీ రివ్యూ

తెలుగు సినిమాల్లో చెరగని సంతకం-విశ్వనాథ