‘దిశ’పై సందీప్ వంగ ట్వీట్.. నువ్వూ నీతులు చెప్పేటోడివా అని ట్రోల్ - MicTv.in - Telugu News
mictv telugu

‘దిశ’పై సందీప్ వంగ ట్వీట్.. నువ్వూ నీతులు చెప్పేటోడివా అని ట్రోల్

December 2, 2019

దిశ హత్యాచారంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దుండగులను శిక్షించాలని పార్లమెంటులోనూ ఎంపీలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్య జనం వరకూ దేశంలో మహిళకు రక్షణ ఎక్కడ అని నిలదీస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ కేసుపై ట్వీట్ చేశారు. ఆడవారికి జోలికి రావాలంటే వణుకు పుట్టాలని అన్నాడు. 

‘సమాజంలో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే భయం ఒక్కటే మార్గం. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి నేరస్తుల్లో వణుకు పుట్టించాలి. పాశవిక శిక్షలతో అడ్డుకోవాలి..  ప్రస్తుతం దేశంలోని ప్రతి అమ్మాయికి భరోసా కావాలి..’ అని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అర్జున్ రెడ్డి, దాని రీమేక్ కబీర్ సింగ్ సినిమాల్లో మహిళపై హింసను చూపించి, పురుషాధిపత్యాన్ని, చెడు అలవాట్లను గ్లోరిఫై చేసిన సందీప్ రెడ్డి కూడా నీతులు చెబుతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ స్పందిస్తూ.. ‘నువ్వు చెబుతున్న ఆ భయం.. నీ సినిమాలో ఆమెను కొట్టకుండా అడ్డుకోగలిగిందా?’ అని నిలదీశారు. ‘అమ్మాయి నచ్చితే ఆమె అనుమతి లేకపోయినా ముద్దుపెట్టుకోవచ్చు, ఒళ్ళో పడుకోవచ్చు,డ్రెస్ తీయమని కత్తితో బెదిరించొచ్చు,నాకోరిక తీర్చు, ప్రేమ అని మాట్లాడకు,లాంటి సైకో ఆలోచనలతో సినిమా తీసిన మీరు కూడా నీతులు చెప్తే ఎలా భయ్యా, maturity ఉన్నోడు అది సినిమా అనుకుంటాడు,యువత అదే ఫాషన్ అనుకుంటోంది’ అని మరో నెటిజన్ మండిపడ్డాడు. అసలు ఈ కేసులో మొదట అరెస్ట్ చేయాల్సింది సందీప్ వంగనే అని కొందరు అంటున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లలో ఆడవారిపై ఆధిపత్యం చలాయిస్తున్న సీన్లను, సంభాషణలను పోస్ట్ చేస్తున్నారు.