టీఆర్ఎస్‌లోకి సండ్ర! హరీశ్ రావుతో భేటీ.. - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్‌లోకి సండ్ర! హరీశ్ రావుతో భేటీ..

February 9, 2018

తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి టీడీపీని వదలి కాంగ్రెస్‌లోకి వెళ్లాక మొదలైన ఫిరాయింపులు ఎన్నికల నేపథ్యంలో మరింత ముమ్మరం అయ్యాయి.  సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం హైదరాబాద్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుతో భేటీ ఆయ్యారు. ఆయనతోపాటు  టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు కూడా మంత్రిని కలుసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో రైతులు ఎదదుర్కొంటున్న కరెంట్, అప్పులు, గిట్టుబాటు ధరలు, సాగునీరు వంటి విషయాలపై చర్చించడానికి తామే హరీశ్ రావును కలిశామని సండ్ర, రావుల చెప్పారు. మంత్రి తమ డిమాండ్లకు సానుకూలంగా స్పదించారన్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చించడానికే వీరు సమావేశం అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీలో చేరడం తప్ప మరో గత్యంతరం లేదని వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హరీశ్‌పై తీవ్ర విమర్శలుచేసిన సండ్ర.. ఇప్పుడవన్నీ మరచిపోయి మంతనాలు జరపడం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదని పరిశీలకులు చెబుతున్నారు.