‘ఇక పైలం.. నేను కూడా పోతున్నా..’ అంటున్న జగ్గారెడ్డి! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఇక పైలం.. నేను కూడా పోతున్నా..’ అంటున్న జగ్గారెడ్డి!

March 16, 2019

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు రోజుకొకరు వలసలు పడుతుండటంతో పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. పోయే ఎమ్మెల్యేలను ఎలా ఆపాలో అర్థంకాక అయోమయంలో పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలతోనే సరిపెట్టుకుంది. అందులోంచి రోజుకో ఎమ్మెల్యే వలస పోతుండటంతో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి  గుడ్ బై చెప్పడాన్ని నేతలు జీర్ణించుకోవడం లేదు.

గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు నమ్మకస్తుడిగా పేరొందిన.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయినట్లు, కాంగ్రెస్ కూడా ఖాళీ అవడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కాంగ్రెస్ హేమాహేమీలు సైతం ఓటమిపాలైనా.. ఆయనొక్కరే విజయం సాధించి, సత్తా చాటారు. ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆయన టీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగానే ఉన్నారు. పలు సందర్భాల్లో నియోజకవర్గ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా కలుస్తానని ప్రకటించారు.

Sangareddy telangana congress mla jaggreddy toorpu jayaprakash may join in trs rumours spread

ఇక అప్పటి నుంచి జగ్గారెడ్డి ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా ఆయన దొరకడం లేదని ప్రచారం. ఆయన ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసివుంటున్నాయని పార్టీ నాయకలు పేర్కొంటున్నారు. ఇదంతా చూస్తుంటే జగ్గారెడ్డి కూడా గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, టీఆర్ఎస్ అధినేతతో కలిసి మంతనాలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఆయన తన అనుచరులతో చెప్పారని, తాను వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారని వార్తలు వస్తున్నాయి . ఈ ఆరోపణలను ఆయన అనుచరులు గానీ, నాయకులు గానీ ఖండిచడంలేదంటే ఇది నిజమే అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియ (ఇల్లెందు), సబితారెడ్డి (మహేశ్వరం), ఉపేందర్ రెడ్డి (పాలేరు)లు గులాబీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జంప్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకి పడిపోనుంది. వలసల పర్వం ఇలాగే కొనసాగితే.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోనుంది.