రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత సానియా మీర్జా త్వరలో ఆటకు వీడ్కోలు పలకనుంది. దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ తన చివరి టోర్నమెంట్ అని సానియా మీర్జా ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగి డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో ఆడి ఆటకు వీడ్కోలు చెబుతానని 36 ఏళ్ళ సానియా తెలిపింది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడనుంది. ఈ టోర్నీలో కజకిస్థాన్ క్రీడాకారణి అనా డనిలినా, సానియా మీర్జా జోడిగా బరిలో దిగనున్నారు.
గత ఏడాది మోచేయి గాయంతో యూఎస్ ఓపెన్ నుంచి సానియా వైదొలుగాల్సి వచ్చింది. తర్వాత ఆటనుంచి తప్పుకోవాలని భావించినా..ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని మళ్లీ గ్రౌండ్‌లో అడుగు పెడుతోంది. "గాయం కారణంగా నా కెరీర్ ను ముగించాలనుకోలేదు. అందుకే మళ్ళీ సాధన చేశా, ప్రస్తుత శిక్షణలో పూర్తి ఫిట్నెస్ సాధించా" అని ఓ ఇంటర్వ్యూలో తాజాగా సానియా మీర్జా వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన సానియా మీర్జా 2003లో తన టెన్నిస్ కెరీర్ను ప్రారంభించింది. 2013లో ఆమె సింగిల్స్ నుంచి తప్పుకున్న ఆమె తర్వాత డబుల్స్పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం సానియా మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకులో ఉంది. ఆమె ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి.