ఇదేనా మనం కోరుకున్న దేశం? సానియా ట్వీట్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేనా మనం కోరుకున్న దేశం? సానియా ట్వీట్..

April 12, 2018

కశ్మీర్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్, యూపీలో యువతిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారాలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. పలువురు సెలబ్రిటీలు వీటిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా దీనిపై స్పందించింది. ‘ఇదేనా మనం కోరుకున్న దేశం?’ అని ప్రశ్నించింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. మతం, దేశభక్తి, శత్రుత్వాలు, అత్యాచారాలు అన్నీ కలగలసి పోవడంతో రచ్చరచ్చ మొదలైంది.

 ఇలా మొదలైంది..

న్యూయార్క్ టైమ్స్ ట్విటర్ ఖాతాలో ఈ అత్యాచారాలపై ఒక ట్వీట్ వచ్చింది. 8 ఏళ్ల కశ్మీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు అండగా హిందూ జాతీయవాదులు నిరసలు తెలుపుతున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై సానియా మీర్జా స్పందించింది. ‘ఇదేనా మనం కోరుకున్న దేశం? ప్రంపచానికి మనం ఇలా పేరుమోశామని తెలియాలా? ఎనిమిదేళ్ల బాలికకు కుల, మత, లింగ, వర్ణ భేదాలకు అతీతంగా అండగా నిలబడలేకపోతే ఇంకేదానిపైనా పోరాడలేం. అది మానవత్వం అనిపించకోదు. నాకు కడుపు దేవినట్లుగా అనిపిస్తోందిఅని ట్వీట్ చేసింది.

పాక్ ఉగ్రవాదులు చంపేసిన సంగతో..

సానియా ట్వీట్‌పై వివాదం మొదలైంది. మేడమ్‌.. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఒక పాకిస్తానీని పెళ్లాడారు. మీకు ఇంకా భారత్‌తో సంబంధం ఉందా?  పాకిస్తాన్‌ ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజల గురించి కూడా మీరు ట్వీట్‌ చేస్తే బాగుంటుంది..’ అని ఎద్దేవా చేశాడు ఓ నెటిజన్. పాకిస్తాన్‌లో అత్యాచారాల శాతం 28 అని, భారత్‌లో కేవలం 1.8 మాత్రమేనని మరొకరు సానియాకు గుర్తుచేశారు. కశ్మీర్ బాలిక మాదిరే ఘోర అత్యాచారానికి బలైన పాకిస్తాన్ బాలిక గురించి సానియా సున్నిత హృదయం ఎందుకు ద్రవించలేకపోయిందని మరొకరు ప్రశ్నించారు. ఆమెకు భారత్ తరఫున ఆడుతూ, డబ్బులు సంపాదించుకుంటూ, భారత్‌పైనే బురదజల్లడం పనిగా పెట్టుకుందని మరొకరు మండిపడ్డారు. నీకు భారత్‌లో ఇబ్బందిగా ఉంటే శాశ్వతంగా పాకిస్తాన్‌కో, చైనాకో వెళ్లిపో అని కొందరు సూచించారు.

ఈ విమర్శలపై సానియా స్పందించింది. ‘ఎవరిని పెళ్లి చేసుకున్నామనేది ముఖ్యం కాదు. నేను భారత్‌ కోసం ఆడతాను. నేను భారతీయురాలిని. జీవితాంతం అలాగే ఉంటాను. నేను మీలా స్పందించకుండా ఉండలేను. మానవత్వం ఉన్న ప్రతీఒక్కరూ ఇలాంటి సమయాల్లో మతాల గురించి, మరే ఇతర అంశాల గురించి మాట్లాడరు’ అని పేర్కొంది.