Sanitation workers on strike in AP
mictv telugu

ఏపీకి చెత్త ముప్పు.. సమ్మెలో పారిశుధ్య కార్మికులు

July 11, 2022

Sanitation workers on strike in AP

తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీలో పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగారు. ఆదివారం యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35వేల మంది పారిశుధ్య సిబ్బంది, ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆయా మున్సిపల్ ఆఫీస్‌ల ఎదుట వారు ఆందోళనకు దిగారు.

ప్రధానంగా తొమ్మిది డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మునిసిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. గత నెలలోనే ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం కార్మిక సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

మరోవైపు సమ్మె కారణంగా.. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోవడంతో.. మున్సిపల్‌ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించింది. అమరావతిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కార్మిక సంఘాల జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించారు. ఈ సాయంత్రం కార్మికుల వేతనాలు పెంపు, తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లపై చర్చించనున్నారు.