లండన్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు - MicTv.in - Telugu News
mictv telugu

లండన్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

January 22, 2020

vcbnhg

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.  తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) ఈసారి సంక్రాంతి వేడుకలను 19 జనవరి 2020న పశ్చిమ లండన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ ఉత్సవాలలో 500లకు పైగా తెలుగు కుటంబాలు పాల్గొన్నాయి. భోగి పళ్ళు, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, రంగు రంగుల ముగ్గులతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. కోలాటం, గొబ్బెమ్మలు, వివిధ పాటలు, నృత్యాలతో తాల్ ఆవరణ కళకళలాడింది. 

అధిక సంఖ్యలో మహిళలు ముగ్గుల, వంటల పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల, ముగ్గుల పోటీల్లో విజయం సాధించిన మహిళలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. చిన్నారులను ప్రోత్సహించే దిశగా వారికి గాలి పటాల తయారీ పోటీని నిర్వహించి విజేతలను సత్కరించారు. తాల్ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులు, గాయని కారుణ్య, నీరజ్, భగవాన్ అందరిని అలరించారు. డా.విశ్వనాథ్, ఇందిరలు యోగా ప్రాముఖ్యతను పిల్లలకు చాటుతూ యోగాను వేద సంగీతంలో మిళితం చేసి ప్రదర్శించారు. చిన్నారి అభయ్ కల్లూర్ పియానో వాద్యం కళతో అలరించాడు. ఈ సందర్భంగా, తెలుగు భాషను, సంస్కృతిని భావితరాలకు అందించే ప్రయత్నంగా తాల్ నిర్వహిస్తున్న సాంస్కృతిక కేంద్రంలో తమ పిల్లలను చేర్పించి వారు తెలుగు భాష, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు తాల్ సాంస్కృతిక కేంద్రాల ఇంచార్జీలు రాజేష్ తోలేటి, గిరిధర్ పుట్లూరు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తాల్ చైర్మన్ శ్రీధర్ సోమిశెట్టి, కార్యవర్గం భారతి కందుకూరి, రాజేష్ తోలేటి, శ్రీనివాస్ రెడ్డి ఇందులో పాల్గొన్న అన్ని కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు.