రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖ పండుగల్లో సంక్రాంతి ఒకటి. బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఈ పండుగ నాడు మాత్రం సొంతూరుకు చేరుకుంటారు. ప్రభుత్వాలు సైతం ఈ పండుగకు భారీగా సెలవులు ఇస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పండుగ సంబరాలు జరిగే తీరే వేరు. అంతే కాకుండా.. తెలంగాణలో కూడా ఈ సంక్రాతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు పాఠశాలలకు, కాలేజీలకు సెలవులను ప్రకటించాయి.
దీంతో నగరవాసులంతా పిల్లాపాపలతో సొంతూళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు. టోల్ బూత్‌లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు తొందరగా వెళ్తున్నాయి.
కాగా, జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్ల వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పంతంగితోపాటు కొర్లపాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.