పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తాజాగా ధనుష్‌తో కలిసి సార్ అనే సినిమాలో నటించారు. ఫిబ్రవరి 17న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న సంయుక్త.. ప్రేమ, పెళ్లిలపై తనదైన భాష్యం చెప్పారు. ‘ప్రేమ అనేది విశ్వవ్యాప్తం. లవ్ అంటే తల్లిదండ్రులను, వృత్తిని ప్రేమించడం. ప్రస్తుత కాలంలో ప్రేమ అంటే బాయ్‌ఫ్రెండుతో రొమాన్స్‌నే ముఖ్యంగా చూస్తున్నారు. మిగతా అంశాలను పట్టించుకోవడం లేదు. ఇక పెళ్లి అనేది పెద్ద గ్యాంబ్లింగ్. దాని అవసరం పెద్దగా లేదు. ఒకప్పుడు వివాహమనేది అవసరం.
స్త్రీకి ఎమోషనల్‌గా, ఆర్ధికంగా మద్దతు అవసరం కాబట్టి పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతీ అమ్మాయి తన సొంత కాళ్లపై నిలబడుతున్నది. పెళ్లి అనేది వ్యక్తిగత ఛాయిస్ మాత్రమే. నా వరకు సరైన పార్ట్‌నర్ దొరికితే అప్పుడు ఆలోచిస్తా’నంటూ అభిప్రాయపడ్డారు. అలాగే తన పేరులోంచి ఇంటి పేరు తొలగించడంపై కూడా స్పందించారు. ‘నా తల్లిదండ్రులు గొడవలు పడి విడిపోయారు. నేను స్వయంగా ఎదిగి యాక్టర్ అయ్యాను. నా పేరుకు తోకలు ఉండాల్సిన అవసరం లేదు.
అందుకు పేరు నుంచి తండ్రి పేరును తొలగించాను. ఇక నుంచి అదే నా ఐడెంటిటీ. కేరళలో ఆధునిక భావాల ప్రభావం ఎక్కువ. అందుకే నేను ఇలా ఆలోచిస్తున్నానని అనిపిస్తుంది’ అని స్పష్టం చేశారు. ఇక తనను సమంత పోలికలతో ఉన్నానని చెప్పడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక కాంప్లిమెంట్ అంటూ ఆమె కంటే గొప్పగా నటిస్తున్నావని ఎవరైనా అంటే ఇంకా ఆనందంగా ఫీలవుతానని చెప్పారు.