సర్వాయి పాపన్న నీకు సలాం.. - MicTv.in - Telugu News
mictv telugu

సర్వాయి పాపన్న నీకు సలాం..

August 18, 2017

బలవంతుల పాలనలో పాలితులెప్పుడు పీడితులే.. అగ్రవర్ణాలది అధికారమయితే నియంతృత్వమే బహుజనులకు బహుమతి. అందుకే క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు. సబ్బండ వర్ణాల బలగంతో రాజ్యాధికారం సంపాదించాడు. పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి అందించాడు. అతను మరెవరో కాదు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. వీరత్వంలో శివాజీకి ఏమాత్రం తీసిపోని సర్వాయి పాపన్నను గుర్తు చేసుకుందాం. ఈ రోజు సర్వాయి పాపన్న పుట్టిన రోజు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్..మూడున్నర శతాబ్దాల క్రితం ఈ పేరో సంచలనం. రాజ్యాధికారం గురించి కనీసం ఆలోచించడమే పాపమయిన కాలంలో సింహాసనాన్ని అధిష్టించిన బహుజన సింహం.. నవాబుల తాబేదార్ గా మారిన అగ్రవర్ణ దోపిడి వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి. 17వ శతాబ్దిలోనే తెలంగాణ గడ్డపై పోరువిత్తనాలు నాటిన విప్లవకారుడు. బలహీన వర్గ కుటుంబంలో పుట్టి రాచరిక పునాదులను కదిలించిన ధీరోధాత్తుడు సర్వాయి పాపన్న గౌడ్.

తెలంగాణ పౌరుషాన్ని పోతపోసుకున్న గౌడ్ సాబ్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ లో 1650 అగస్ట్ 18న పుట్టాడు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మే సర్వస్వమై పాపన్నను పెంచింది .రాచరిక వ్యవస్థ నీడలో జమీన్ దార్లు, జాగీర్ దార్లు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడడంతో అతనికి చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరనరాన ఇంకింది. అందుకే ఎలాగైనా ఆ నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడు. కులవృత్తిని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం పోరుబాట పట్టాడు. అయితే అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేశాడు. అందుకే స్నేహితులైనన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్ మహ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్ లతో గెరిల్లా సైన్యాన్ని తయారుచేశాడు. అగ్రకుల భూస్వాములు,  వ్యాపారుల గడీలపై,  కోటలపై దాడి చేశాడు. సంపదను బహుజన పేదలకు పంచాడు. గడీల్లో బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల ప్రజలను విడిపించాడు.

పన్నెండు మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం పన్నెండు వేలకు చేరింది. చిన్న చిన్న సంస్థాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించాడు పాపన్న గౌడ్. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్నీ రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు.  ఖిలాషాపూర్ లో పటిష్టమైన కోటను కట్టించాడు. పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. కులవృత్తులను ప్రోత్సహించాడు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు చెట్లను నాటించాడు.

అయితే ఒక బహుజనుడు రాజ్యపాలన చేయడాన్ని అగ్రవర్ణాలు తట్టుకోలేకపోయాయి. అగ్రవర్ణ పెత్తందార్లు మొగల్  పాలకులతో చేతులు కలిపారు. దీంతో 1706 లో పాపన్న పై దాడి చేసేందుకు మొగల్ సేనాని రుస్తుంఖాన్ ప్రయత్నించాడు. కాని పాపన్న బలాన్ని సరిగా అంచనా వేయలేక వెనకడుగు వేశాడు.1707 లో ఔరంగజేబు చనిపోవడంతో మొగల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్టించాడు. ఈ పరిణామాన్ని అతని తమ్ముడయిన బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ కామ్ బక్ష్ తట్టుకోలేక తిరుగుబాటు చేశాడు. ఇలా కుటుంబ గొడవల్లో మొగలులు ఉండగానే వేలాదిమంది సైన్యంతో పాపన్న వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. మచీలిపట్నంలో ఉన్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొన్నాడు. వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత భువనగిరి ఖిల్లాను తన ఖాతాలో వేసుకున్నాడు.

సర్వాయి పాపన్న విజయాలు మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకుపుట్టించాయి. అయితే సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని తెలుసుకున్న మొగల్ చక్రవర్తి బహదూర్ షా అతనికి స్నేహ హస్తం అందించాడు. అధికారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగాకప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చన్నాడు. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నడు. బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు మొగల్ సైనికుల కు భారీగా ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చాడు. దీనికి ప్రతిఫలంగా గోల్కొండ కోటకు పాపన్నను రాజుగా ప్రకటించాడు.

ఒక కల్లుగీసేవాడు గోల్కొండ కు రాజు కావడాన్ని అగ్రవర్ణ కులాలు జీర్ణించుకోలేకపోయాయి. పాపన్న బహుజన రాజ్యాన్ని కూల్చడానికి ఎన్నో కుట్రలు చేశాయి.  బహదూర్ షాకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టాయి. 1709 లో తాడికొండలో మొఘల్ సైన్యానికి పాపన్న యోధులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. కొన్ని నెలల పాటు అది కొనసాగింది..చివరకు ఆ పోరాటంలో పాపన్న సైన్యం ఓడిపోయింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెనకడుగు వేయడంలో తప్పులేదనుకున్న పాపన్న అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు.

సర్వాయి పాపన్న ఎక్కడ ఉన్నాడో కొన్ని రోజుల పాటు ఎవరికీ తెలియలేదు.  చివరకు హుస్నాబాద్ లో ఓ కల్లు మండువాలో గీతకార్మికుడిగా పనిచేశాడు. ఆ గ్రామంలో గౌడ కులస్థులు ఎక్కువగా ఉండడంతో అదే సురక్షిత ప్రాంతమనుకున్నాడు పాపన్న. కాని అప్పటికే గౌడ్ సాబ్ కోసం ఊరూరూ గాలిస్తున్న మొగల్ సైనికులు.. పాపన్నను గుర్తించి పట్టుకున్నారు. అతని తలను నరికి బహదూర్ షాకు బహుమానంగా పంపారు. మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు.

స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. అదే కాలంలో మొగల్ పాలనపై సమరశంఖం పూరించిన శివాజీకి పాపన్న ఏ మాత్రం తక్కువ కాదు. దక్షిణ భారతదేశంలో మొగల్ సామ్రాజ్యవిస్తరణను అడ్డుకున్న తొలి యోధుడు పాపన్నే. ఇంతేకాదు, పూలే కంటే ముందే బహుజనులందరి సంక్షేమం కోసం పాటుపడిన సామాజిక విప్లవకారుడు పాపన్న. అయినా చరిత్రలో సర్దార్ సర్వాయిపాపన్నకు తగిన ప్రాధాన్యం దక్కలేదు.

పాపన్నగొప్పతనాన్ని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్లు లండన్ మ్యూజియంలో గౌడ్ సాబ్ ఫోటోను పెట్టుకున్నారు. కాని ఇక్కడ ఏం జరిగింది? తొలి బహుజన రాజు సర్వాయి పాపన్న జీవితాన్ని, విజయాలను మట్టిలో కప్పారు. ఆ యోధుడి గొప్పతనాన్ని చీకట్లో కలిపారు. ఇప్పటి వరకు రాసిన చరిత్రలో పాపన్న పేరు కనిపించదు.

తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రావతరణతో ఫలించిన నేపథ్యంలో ఇకనైనా పాపన్న చరిత్రను భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం పాలకులపై ఉంది.