31న చరిత్ర సృష్టించనున్న భారత్.. 182 మీటర్ల సర్దార్ - MicTv.in - Telugu News
mictv telugu

31న చరిత్ర సృష్టించనున్న భారత్.. 182 మీటర్ల సర్దార్

October 12, 2018

స్వతంత్రం, దేశభక్తి అనగానే  మనకు మొదట గుర్తుకొచ్చేది గాంధీజీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు ఎంతో గౌరవం దక్కింది. జాతిపితగా గౌరవించి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. కరెన్సీ నోట్లపై అచ్చేసుకున్నాం. నెహ్రూ వంటి నేతలనూ విగ్రహాలు పెట్టి గౌరవించుకున్నాం. కానీ ఎంతోమంది స్వతంత్ర యోధులకు ఇంకా సరైన గౌరవం దక్కడం లేదు. ఆ లోటును పూడ్చడానికి అన్నట్లు తొలి హోంమంత్రి, భారత ఏకీకరణ నేత, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అత్యంత అరుదైన దక్కనుంది.

సర్దార్ స్మారకార్థం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2013లో కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నర్మదా నది ఒడ్డున‘ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో దీన్ని నిర్మించింది. పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు కింద, డ్యామ్ వైపు చూస్తున్నట్లు దీన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆవిష్కరించనున్నారు.

ఐక్యత కోసం..

దేశ ఐక్యత, సమగ్రతకు చిహ్నంగా ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని పేరు పెట్టారు. అంతేకాదు న్యూయార్క్‌లోని స్టాచ్యూ  ఆఫ్ లిబర్టీ (600 అడుగులు..182 మీటర్లు) కంటే ఈ విగ్రహం రెండింతలు పెద్దది. అహ్మదాబాద్ నుంచి 200కిలో మీటర్ల దూరంలో ఉన్న సర్దార్‌ను చూడ్డానికి కెవాడియా పట్టణం నుంచి సాధు దీవికి వెళ్లాలి. దీని కోసం దీవి వవరకు 3.5కి.మీ మేర హైవేను కూడా నిర్మిస్తున్నారు.

2500 మంది కార్మికులతో..

ఈ విగ్రహం నిర్మాణానికి 2500 మంది కార్మికులు పని చేశారు. ఇందులో వందలాది చైనాకు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. 5000 కంచు పలకలతో విగ్రహం పూర్తిచేయడానికి వీరంతా రాత్రింబవళ్లు కష్టపడ్డారు.

రూ.2990 కోట్లు.. 22500 మెట్రిక్ టన్నుల సిమెంట్..

‘స్టాచ్యూ  ఆఫ్ యూనిటీ’ తయారీకి రూ.2990 కోట్లు ఖర్చయింది. ఇందుకోసం మొత్తం 22500 మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను  వినియోగించారు. భారీ క్రేన్లు, అత్యాధునిక టెక్నాలజీ వాడారు. విగ్రహాన్ని అత్యంత దృఢంగా నిర్మించారు. సెకెనుకు 60మీట్లర్ల వేగంతో వీచే గాలులను, వైబ్రేషన్, భూకంపాలను కూడా ఈ విగ్రహం తట్టుకుంటుంది.