చీరకొంగు కత్తిరించి రూ.30 వేలు చోరీ.. - MicTv.in - Telugu News
mictv telugu

చీరకొంగు కత్తిరించి రూ.30 వేలు చోరీ..

October 24, 2020

Union Bank

పాపం ఓ వృద్ధురాలిని దొంగలు నిలువునా ముంచారు. ఆరుగాలం కష్టపడ్డ పంట అమ్మగా వచ్చిన రూ.30 వేలను ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసి కొంగులో కట్టుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయింది. ఆమెను ఫాలో అవుతున్న దొంగలు ఆటోలో ఎక్కించుకుని కొంగుముడిని కత్తిరించుకుని డబ్బులతో ఉఢాయించారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజాం మండలం గురవాము గ్రామానికి చెందిన గురవాన వెంకటమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం రాజాంలోని యూనియన్‌ బ్యాంక్‌‌కు వెళ్లింది. తన ఖాతాలో ఉన్న రూ.30 వేలు నగదును మధ్యాహ్నం విత్‌డ్రా చేసింది. అనంతరం తన గ్రామానికి వెళ్లడానికి పాలకొండ సెంటర్‌లో బస్‌ కోసం వేచి చూస్తోంది. అప్పుడే తన పక్కన ఒక నంబర్‌ లేని ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆమె ఏటీఎంకు వెళ్లినప్పటినుంచి వారు ఆమెను ఫాలో అవుతున్నారు. డ్రైవర్‌ ప్రయాణికుల కోసం చూస్తున్నట్టు నటిస్తూ గురవాము.. గురవాము.. అంటూ అరిచాడు. అయినా ఆమె స్పందించలేదు. దీంతో ముందుకు వెళ్లినట్టే వెళ్లి, మళ్లీ వృద్ధురాలు ఉన్నచోటుకే వచ్చారు. 

ఆటోలో ఉన్న మహిళలు కూడా ఆమెను పిలిచి ఆటో ఎక్కించారు. వెంకటమ్మ కూడా నమ్మకంగా ఆటో ఎక్కింది. ఆటో అక్కడినుంచి కదిలి పోనుగూటివలస జంక్షన్‌‌కు రాగానే ఆపారు. మధ్యలో ఉన్న మహిళ దిగిపోతుందని నమ్మబలికి, చివర్లో కూర్చున్న వృద్ధురాలిని కిందకి దిగమన్నారు. వెంకటమ్మ దిగిన వెంటనే ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చి ముగ్గురూ పరారయ్యారు. అయితే వెంకటమ్మ అప్పటికి కూడా తన డబ్బులు పోయాయని గ్రహించలేకపోయింది. వేరే ఆటో ఎక్కి ఇంటికి చేరుకుంది. అప్పటికి గాని తన చీర చెంగు కత్తిరించారని చూసుకుని షాక్ అయింది. తన కష్టాన్ని దోచుకెళ్లారని ఆమె గెండెలు బాదుకుంది. గ్రామస్తుల సాయంతో రాజాం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సైతం మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 9.30 గంటలు వరకు ఆమెను స్టేషన్‌లో ఉంచి విచారించారు. చివరికి రాజాం పోలీసులు ఈ కేసు తమ పరిధిలోకి రాదని, సంతకవిటి పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడికి పంపించేశారు. సంతకవిటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఆ వృద్ధురాలికి చెప్పారు. కాగా, డబ్బులు ఖర్చు పెట్టుకుని, పోలీస్‌ స్టేషన్‌‌ల చుట్టూ తిరిగితే, పోయిన డబ్బులు తిరిగి వస్తాయో, రావోనని వెంకటమ్మ కన్నీరుమున్నీరు అవుతోంది.