పెద్దలకు మాత్రమే.. ఓ అభ్యర్థి ప్రచారం  - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దలకు మాత్రమే.. ఓ అభ్యర్థి ప్రచారం 

October 27, 2019

Sarees...

కావాల్సినన్ని వింతలు విచిత్రాలు ఎన్నికల సమయంలో కళ్లు తరించేలా చూడొచ్చు. తాము గెలవాలనే తాపత్రయంలో పడ్డ నేతలు చిత్ర విచిత్ర ఫీట్లు వేస్తుంటారు. తాజాగా ఓ నేత టోకెన్ రాజకీయాలకు తెరలేపారు. బహుశా ఈయనలా ఇంకెవరూ ఆలోచించి ఉండరు అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. తాను మీటింగ్ పెట్టే చోటకు వచ్చే ప్రజలకు ఆయన టోకెన్‌లు అందజేస్తున్నారు. వాటిని తీసుకెళ్ళి షాపులో చూపిస్తే చీరలు, దుప్పట్లు ఇస్తారని ఆయన అనుచరులు టోకెన్‌లు పంచుతున్నారు. ఆయన పేరు ఎంబీటీ నాగరాజ్. మాజీ మంత్రి అయిన ఆయన బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే అసెంబ్లీ నియోజ వర్గంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేతిలో అనర్హత వేటుకు గురయ్యారు. 

డిసెంబర్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. దేశంలో అత్యంత శ్రీమంతుల ఎమ్మెల్యేల్లో ఎంటీబీ నాగరాజ్ ఒకరు. ఆయన ఆస్తి రూ. వెయ్యి కోట్ల పైగా ఉంది. తాను నిర్వహిస్తున్న సభలకు ప్రజలు రాకపోవడంతో టోకెన్‌ల ఉపాయానికి తెరలేపారు ఆయన. బీజేపీ నుంచి బరిలో దిగుతున్న నాగరాజ్‌ను మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ తదితరులు ఎంటీబీ నాగరాజ్‌ను ఉప ఎన్నికల్లో ఓడిస్తామని ఇప్పటికే చాలెంజ్ చేశారు. 

నాగరాజ్ హోసకోటే నియోజక వర్గంలో అనేక గ్రామ పంచాయితీ సభలు నిర్వహించారు. అయితే ఊహించని స్థాయిలో ప్రజలు మద్దతు ఇవ్వకపోవడం, సభలకు హాజరు కాకపోవడంతో ఆయన టోకెన్ ఉపాయాన్ని ఆచరణలో పెట్టారు. గ్రామ పంచాయితీ సభలకు హాజరవుతున్న ప్రజలకు ఎంటీబీ నాగరాజ్ టోకన్‌లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి టోకన్ మీద MTB అని ఇంగ్లీష్‌లో తన పేరును ఎంటీబీ నాగరాజ్ ముద్రించారు. MTB పేరు కింద ‘నీటిని వృధా చెయ్యకండి భావి తరాలకు నీరు ఎంతో అవసరం’ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. MTB అనే పేరు ఉన్న టోకన్ తీసుకెళ్లి షాప్‌లో ఇస్తే ఉచితంగా చీరలు, దుప్పట్లు ఇస్తారని ఎంటీబీ నాగరాజ్ అనుచరులు ప్రచారం చేస్తున్నారు.

అయితే MTB అనే పేరు ఉన్న టోకన్ పిల్లలు తీసుకెళ్లి షాపుల్లో ఇస్తే వెనక్కి తీసుకుని ఉత్త చేతులతో వెనక్కి పంపిస్తున్నారు. దీనిపై ఎంటీబీ అనుచరులు కొన్ని షరతులు విధించారు. MTB టోకన్‌ను పెద్దలు మాత్రమే షాప్‌లకు తీసుకెళ్లి ఇస్తేనే ఉచితంగా చీరలు, దుప్పట్లు ఇస్తారని చెప్పారు. అంతేకాదు గ్రామ సభలకు పెద్దలు మాత్రమే హాజరు కావాలని, పిల్లలు వస్తే టోకన్లు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇలా కొనసాగుతున్నాయి నాగరాజ్ వింత టోకెన్ రాజకీయాలు.