21 సంవత్సరాల నుంచి మిసెస్ వరల్డ్ భారతదేశానికి రాలేదు. ఈ సంవత్సరం ఆ కిరీటం మన దేశానికి వచ్చింది. 32 సంవత్సరాల సర్గమ్ కౌశల్ ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
డిసెంబర్ 18, 2022న లాస్ వెగాస్ లో మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందింది సర్గం. శ్రీమతి కౌశల్ 63 దేశాల నుంచి పోటీని ఎదుర్కొని ఈ కిరీటాన్ని పొందింది. ‘సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 21 సంవత్సరాల తర్వాత మనకు రావడం గర్వంగా ఉంది’ అంటూ జమ్మూకశ్మీర్ నివాసి సర్గం కౌశల్ తెలిపింది. టైటిల్ గెలిచిన తర్వాత తాను ఎంత సంతోషంగా ఉన్నానో తెలిపే వీడీయోన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పోటీ చివరి రౌండ్ లో కౌశల్ భావన రావు రూపొందించిన పింక్ స్లిట్ గౌనును ధరించింది. మోడల్ అలెసియా రౌత్ కౌశల్‌కి మెంటర్ గా ఉన్నది.
ఎవరీ సర్గం?
ఇన్ స్టా స్టోరీ ప్రకారం.. సర్గం ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని చేసింది. అంతేకాదు.. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో టీచర్ గా పనిచేసింది. తన భర్త ఇండియన్ నేవీలో పని చేస్తున్నాడు. సర్గం మోడల్ గా కూడా చేసింది. 2018లో అనేక అందాల పోటీల్లో పాల్గొంది. అదే సంవత్సరం మిసెస్ ఇండియా పోటీలో కూడా పాల్గొంది. కానీ టైటిల్ గెలవలేదు. ప్రస్తుతం మిసెస్ వరల్డ్ 2022 పోటీలో పాల్గొని కిరీటాన్ని గెలుచుకుంది.
ఎప్పుడు మొదలైంది..
వివాహిత మహిళలకు 1984లో మొదటి సారి మిసెస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. దాని మూలాలను మిసెస్ అమెరికా పోటీలో గుర్తించింది. ఈ పోటీకి మిసెస్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు పెట్టారు. 1988 నుంచి మిసెస్ వరల్డ్ అని పిలువబడింది. అప్పటి నుంచి 80 కంటే ఎక్కువ దేశాల్లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ అత్యధికంగా ఈ కిరీటాన్ని గెలచుకుంది. భారతదేశం ఒక్కసారి మాత్రమే ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఇది రెండోసారి గెలుచుకోవడం.
బాలీవుడ్ నటి, మోడల్ అదితి గోవిత్రికర్ మొదటిసారి ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఇప్పుడు గోవిత్రికర్ మిసెస్ ఇండియా ఇంక్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నది. కౌశల్ ఈ కిరీటం గెలుచుకున్నందుకు అభినందనలు తెలియచేసింది. ‘చాలా ఉత్సాహంగా ఉన్నా. భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నా. నా ప్రపంచాన్ని నేను ప్రేమిస్తున్నా. ఈ కిరీటం నాకు మరింత బాధ్యతను పెంచింది’ అంటున్నది కౌశల్. ఇప్పుడు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ మొదలయింది.