Sarkar's anger on loan apps..orders issued
mictv telugu

ఏపీ: లోన్‌ యాప్‌లపై సర్కార్ ఆగ్రహం..ఆదేశాలు జారీ

September 8, 2022

గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో లోన్ యాప్ ఆగడాలకు బలౌతున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని, జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నేడు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్యలకు కారణమౌతున్న లోన్ యాప్ యాజమాన్యాలపై, వారి ఆగడాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై రాష్ట్రంలో లోన్ యాప్‌ల కారణంగా ఏ ఒక్క వ్యక్తి ఆత్మహత్య చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో..”రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని ప్రతి లోన్ యాప్‌పై కఠినంగా చర్యలు తీసుకోండి. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌లో రుణాలను ఇస్తున్న ప్రతి యాప్ వివరాలను సేకరించండి. ఏ రూల్స్ ప్రకారం రుణాలు ఇస్తున్నారో వివరణ కోరండి. రాష్ట్రంలో మళ్లీ రుణ యాప్ వలలో పడి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి చర్యలు చేపట్టండి” అని పేర్కొన్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు రుణ యాప్ వలలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో వారి ఇద్దరి చిన్నారులు నాగసాయి (4), లిఖిత శ్రీ (2)లు అనాధలుగా మిగిలారు. అయితే, ఈ ఘటనపై చలించిన వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చిన్నారులు ఇద్దరికి చెరో రూ. 5లక్షల సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలతకి ఆదేశాలిచ్చారు. అనంతరం లోన్ యాప్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.