భక్తులకు ‘సర్కారువారి పాట’ దర్శకుడు క్షమాపణ - MicTv.in - Telugu News
mictv telugu

భక్తులకు ‘సర్కారువారి పాట’ దర్శకుడు క్షమాపణ

May 21, 2022

సినిమాల్లో వివాదాలు చొప్పించి హైప్ సృష్టించుకోవడం, తర్వాత ‘తప్పయిపోయింది, సారీ’ అని చేతులు దులుపుకోవడం మామూలే. కొందరు తెలిసి చేస్తే కొందరు తెలియక వివాదాల్లో దిగుతుంటారు. మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్‌ చెప్పే డైలాగ్‌పై వివాదం రేగడం తెలిసిందే. దీనిపై మూవీ దర్శకుడు పరశురామ్ స్పందించారు.

‘భక్తుల మనోగాయాలు దెబ్బతినేలా ఉంటే క్షమించండి. వరాహ లక్ష్మీనరసింహ స్వామి అంటే నాకెంతో భక్తి’ అని ఆయన అన్నారు. సినిమా ‘సక్సెస్’ నేపథ్యంలో ఆయన సింహాచల స్వామిని దర్శించుకున్నారు. సినిమాలో ఆ డైలాగును ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని వివరణ ఇచ్చారు. సర్కారు వారి పాట సినిమా ప్రారంభ సమయంలో తాను వరాహ లక్ష్మీనరసింహస్వామని దర్శించి, విజయవంతం చేయాలని కోరానన్నారు. తన తదిపరి చిత్రాన్ని నాగచైతన్య హీరోగా త్వరలోనే ప్రారంభిస్తానని వెల్లడించారు.