ఈ మధ్య కాలంలో పలువురు ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తున్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదో ఒక కారణంతో సభల్లో తక్కువ సమయం గడుపుతున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే పలువురికి ఆదర్శంగా నిలిచారు. చంటి బిడ్డతో సహా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ప్రశంసలు అందుకుంటున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే సరోజ్ అహిర్ వాఘ్ సెప్టెంబరు 30న ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తన రెండున్నర నెలల వయసున్న చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చారు. చిన్నారిని ఎత్తుకుంటూ అసెంబ్లీకి ఆవరణలో కనిపించారు. ఆమెను చంటిబిడ్డతో చూసిన సహచర ఎమ్మెల్యేలు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యేకు సాయంగా బిడ్డను చూసుకోడానికి కుటుంబసభ్యులు ఇద్దరు వచ్చారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చినట్టు ఆమె తెలిపారు. కరోనా కారణంగా రెండున్నరేళ్లుగా నాగ్‌పుర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదని చెప్పారు. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై అసెంబ్లీలో సమాధానాలు రాబట్టేందుకు కుమారుడిని ఎత్తుకుని వచ్చినట్లు వెల్లడించారు. తాను తల్లితో పాటు ప్రజాప్రతినిధిని అని ఎమ్మెల్యే సరోజ్ అహిర్ పేర్కొన్నారు.