డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు ఫార్మసీ మందులు, పంటలపై రసాయన మందుల పిచికారీ చేయడం, కిరాణా సరుకుల డోర్ డెలివరీ వంటివి చూశాం. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ మహిళా సర్పంచ్ నగదు పంపిణీ చేసి కొత్త ఒరవడి సృష్టించారు. పింఛను తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడికి డ్రోన్ ద్వారా పింఛను అందేలా చేశారు. ఈ డ్రోన్ ఖర్చులను సర్పంచ్ వ్యక్తిగతంగా భరించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిషాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామ పంచాయితీ పరిధిలో హెతారాం సత్నామీ అనే దివ్యాంగుడు నివసిస్తున్నాడు.
అయితే ప్రభుత్వం ఇచ్చే పింఛను అందుకోవడానికి ప్రతీనెలా దట్టమైన అడవి గుండా రెండు కిలోమీటర్లు ప్రయాణించి పంచాయితీ వద్దకు వచ్చి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో అంతదూరం రావడానికి నానా తంటాలు పడేవాడు. ఈ ఇబ్బందిని గమనించిన సర్పంచ్ సరోజ్ అగర్వాల్ సొంత ఖర్చతో డ్రోన్ కొనుగోలు చేసి పింఛను డబ్బుని సొంతూరిలోనే తీసుకునే ఏర్పాటు చేశారు. ఇతర దేశాల్లో డ్రోన్ ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుని ఆన్‌లైన్‌లో డ్రోన్ కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించారు. నువాపాడా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సుబేదార్ ప్రధాన్ సర్పంచ్‌ని ప్రశంసించారు. డ్రోన్ కొనే సదుపాయం ప్రభుత్వపరంగా లేకపోయినా సొంత డబ్బుతో డ్రోన్ కొనుగోలు చేసి లబ్దిదారుడికి న్యాయం చేయడం సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు.