Sarpanch Kumari committed suicide out of shame in telangana
mictv telugu

తెలంగాణ: సర్పంచ్‌పై అత్యాచారం..అవమానంతో ఆత్మహత్య

August 5, 2022

కళ్లు మూసుకుపోయిన కామాంధుల మహిళా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. గురువారం ఏపీలోని విజయనగరం జిల్లాలో మహిళా సర్పంచ్‌పై పదకొండు మంది అత్యాచారాయత్నం చేసిన ఘటన మరువక ముందే తెలంగాణలో దాన్ని మించిన ఘోరం జరిగింది. విధుల్లో భాగంగా గ్రామ పర్యటనకు వెళ్లిన మహిళా సర్పంచ్‌పై ఓ యువకుడు అత్యాచారం చేయగా, అవమానభారంతో ఆ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోమటిపల్లి గ్రామపంచాయితీకి భూక్యా కుమారి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ పర్యటన సందర్భంగా నవీన్ అనే యువకుడు సర్పంచ్‌పై అటాక్ చేసి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇందుకు బుజ్జి అనే మరో యువకుడు సహకరించాడు.

ఇది తెలిసిన మరో వ్యక్తి సర్పంచ్ భర్తకు సమాచారమివ్వగా ఆయన అక్కడకి చేరుకొని భార్యను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా, పరువు పోయిందని భావించిన సర్పంచ్ కుమారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం, ఆ తర్వాత హైదరాబాదు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భుక్యా కుమారి గురువారం మృతి చెందారు.

దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు సర్పంచ్‌పైనే అత్యాచారానికి పాల్పడిన నిందితులు కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో వారు సహకరించిన బుజ్జిపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.