చచ్చిపోయింది నేను కాదు మొర్రో: శశి థరూర్ - MicTv.in - Telugu News
mictv telugu

చచ్చిపోయింది నేను కాదు మొర్రో: శశి థరూర్

December 5, 2017

‘వినదగు నెవ్వెరు చెప్పిన.. వినినంతనె వేగపడక..’ పద్యం మీకు తెలుసుకదా. ఏ వార్తనైనా విన్న వింటనే చెవుల్లో వేసుకుని ఫీల్ కావొద్దని, కాస్త ఆరా తీసి ఫీల్ అవాలని ఆ పద్యం చెబుతుంది. అయితే హడావుడి మీడియా మాత్రం అప్పుడప్పుడూ ఈ సూత్రం మరిచి పోయి అభాసుపాలవుతూ ఉంటుంది. బాలీవుడ్ నటుడు శశికపూర్ మరణ వార్త విషయంలో ఇదే జరిగింది.

శశికపూర్ చనిపోయాడని వార్తలురాగానే కొందురు రుషికపూర్ అనుకున్నారు. కొందరు ఏకంగా కాంగ్రెస్ నేత శశి థరూర్ అనుకున్నారు. అనుకోవడంతో సరిపెట్టుకోకుండా కొందరైతే సోషల్ మీడియాలో రిప్.. శశి థరూర్ అంటూ నివాళి అర్పించారు. ఓ ప్రముఖ ఆంగ్లమీడియా తన వెబ్ సైటులో శశిథరూర్ పోయాడు అని రాయగానే పాపం.. ఆయన ఇంటికి ఫోన్లు వెల్లువెత్తాయి. దీంతో బతికి ఉన్న శశిథరూర్ స్పందించారు.

‘పొద్దుణ్నించీ నన్ను చంపేస్తున్నారు. నా కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు. కానీ ఈ రిప్పుపై నాకు ఎలాంటి బాధా లేదు. కనీసం ఇంతటి బాధాకర సమయంలోనైనా నవ్వు తెప్పించినందుకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. శశి కపూర్‌కు ఆయన నివాళులు అర్పిస్తూ.. ‘నాలోని ఓ భాగంకోల్పోయినట్లుగా ఉంది. గొప్ప నటుడు, అందగాడు, కాస్మోపాలిటన్‌. ఆయన పేరు నా పేరు ఒకేలా ఉండడంతో కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. శశి కపూర్‌ని నేను మిస్సవుతున్నాను.’ అని థరూర్‌ పేర్కొన్నారు.