అన్నా డిఎంకె నుండి శశికళ, దినకరన్ ఔట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

అన్నా డిఎంకె నుండి శశికళ, దినకరన్ ఔట్ !

August 28, 2017

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ వూహించలేరు. తమిళ రాజకీయాలు గురించి చెప్పుకుంటే సంచలనాలకు మారుపేరుగా మారాయనే చెప్పొచ్చు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో చాలా మార్పులు కనిపించసాగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా అయిపోయింది ?
తాజాగా తమిళనాడు అధికారిక అన్నా డీఎంకే పార్టీ నుంచి చిన్నమ్మ శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ను బహిష్కరించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో వీరిని బహిష్కరిస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు శశికళ చేసినవేవీ చెల్లవని చెప్పారు.

అలాగే అన్నా డీఎంకేకు చెందిన జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికను పార్టీ నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం నమదు ఎంజీఆర్‌ పత్రిక జయ పబ్లికేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనికి శశికళ యజమానిగా ఉన్నారు. జయ టీవీని మ్యాజిక్‌. కామ్‌ నిర్వహిస్తోంది. పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ ఇటీవలే మళ్లీ కలిసిపోయిన విషయం తెలిసిందే.

దీంతో విలీనంపై దినకరన్‌ ఎదురు తిరిగారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి పళనిస్వామి సహా పలువురు అన్నా డీఎంకే నేతలను తమ పదవుల నుంచి తప్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సమావేశమైన అన్నా డీఎంకే పార్టీ.. శశికళ, దినకరన్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్నాడీఎంకే ఎంపీ ముతుకరప్పన్‌ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. ‘శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి తొలగించాం. ఇకపై పార్టీ తరఫున దినకరన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లదు. పార్టీ నియమాల ప్రకారం.. దినకరన్‌ నియామకం జరగలేదు. అంతేగాక, ఆయన నియామకాన్ని ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరించలేదు’ అని తెలిపారు.

తమిళనాడు రాజకీయాలు ఎవరూ వూహించని విధంగా మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అలా పార్టీ నేతల మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో పార్టీ రెండు రకాలుగా విడిపోయింది. అనుకోకుండా ఇటీవలే రెండు వర్గాలు ఒక్కటయ్యాయి.

శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని అప్పుడే విలీనం సాధ్యమవుతుందని పన్నీర్‌ వర్గం డిమాండ్‌ చేసి ఇప్పుడిలా బహిష్కరణకు పాల్పడ్డారు. ఏదేమైనా తమిళ రాజకీయాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాయన్నది మాత్రం నిజం !