చిన్నమ్మ శశికళ విడుదల వచ్చే ఏడాదికి వాయిదా! - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నమ్మ శశికళ విడుదల వచ్చే ఏడాదికి వాయిదా!

September 16, 2020

she

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు 2017 ఫిబ్రవరి 15న జైలుకి వెళ్లారు. ఈ ఏడాది ఆగస్టు 14న ఆమె విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు బీజేపీ ఢిల్లీ ప్రముఖుడు డాక్టర్‌ ఆశీర్వాదం ఆచారి ఓ ట్వీట్‌‌ చేశాడు. ఈ వార్త తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 

శశికళను శిక్షా కాలానికి ముందే సత్ప్రవర్తన నిబంధనల కింద విడుదల చేయించడానికి ఆమె అక్క కుమారుడు, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె అప్పుడు విడుదల కాలేదు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదల అవుతున్నట్టు సమాచార హక్కు అభ్యర్థన ద్వారా వెల్లడైంది. శశికళ విడుదలపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా జైళ్ల శాఖను ఆశ్రయించగా ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో ఆమె విడుదలపై జరుగుతోన్న ప్రచారానికి తెరపడింది. అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు రూ.10 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ జరిమానాను ఆమె చెల్లించలేకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.