ఆకాశం నుంచి గుర్తు తెలియని వస్తువులు భూమి మీద పడ్డాయి. ప్రజలందరూ ఉగాది వేడుకల్లో ఉండగా.. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఏదో మండుతున్న వస్తువు నేల రాలడం కనిపించింది. మొదట్లో ప్రజలు ఉల్కలు పడుతున్నాయని భ్రమపడ్డారు. కానీ, కాసేపటికే నేల రాలిన వస్తువులను చూసి భయాందోళనకు గురయ్యారు. ఓ ఇనుప శకలం, సిలిండర్ లాంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు కింద పడుతున్న వీడియోను కొందరు యువకులు తమ ఫోన్లలో తీశారు. ఈ ఇనుప శకలం జనావాసాలకు దూరంగా, ఖాళీ ప్రదేశంలో పడడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సిందెవాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని స్థానిక కలెక్టర్ కూడా ధృవీకరించారు. త్వరలో ముంబై నుంచి విపత్తు నిర్వహణ బృందం వచ్చి పరిశోధనలు చేస్తారని ఆయన చెప్పారు. ఈ విషయంపై స్థానిక శాస్త్రవేత్తను అడుగగా, ఉపగ్రహ ప్రయోగం చేసిన అనంతరం కూలిన రాకెట్ బూస్టర్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ శకలాలను గ్రామస్థులు ట్రాక్టర్లో తీసుకెళ్లి తాలూకా కేంద్రమైన సిందెవాహిలోని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇదిలా ఉండగా, ఈ శకలాలు చైనాకు చెందినవిగా పలువురు అనుమానిస్తున్నారు.